అచ్చెన్నాయుడు పై సీఎం జగన్ టార్గెట్ ఫిక్స్ - ఇక తేల్చేద్దాం..!!
ముఖ్యమంత్రి జగన్ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలవాల్సిందేనని స్పష్టం చేస్తున్న జగన్..టీడీపీ ముఖ్య నేతల నియోజకవర్గాల పైన ముందుకు సమీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబు నియోకవర్గం కుప్పంతో తన రివ్యూలు ప్రారంభించారు. ఈ రోజు అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలి నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ తో పాటుగా ముఖ్య నేతలను సమావేశానికి ఆహ్వానించారు.
2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పేరాడి తిలక్ అచ్చెన్నాయుడు పైన పోటీ చేసారు. తిలక్ కు ఆ ఎన్నికల్లో 79, 113 ఓట్లు రాగా, అచ్చెన్నాయుడుకు 87,658 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం తిలక్ కు ఏపీ ప్రభుత్వం కళింగ కార్పెరేషన్ ఛైర్మన్ పదవి కట్టబెట్టింది. దువ్వాడ శ్రీను నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్నారు. అదే సమయంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి సైతం ఈ సారి ఎమ్మెల్యేగా టెక్కలి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో, ఇప్పుడు జగన్ టెక్కలి సమీక్ష సమయంలో ఎవరికి టికెట్ ఇస్తారనేది క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ రెండు సీట్లకు పరిమితం అయింది.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటంతో పాటుగా శాసనసభలో పార్టీ డిప్యూటీ లీడర్ గా అచ్చెన్నాయుడు వ్యవహరిస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన సమయం నుంచి టెక్కలి నియోజకవర్గంలో వివిధ పథకాల కింద అందించిన నిధుల వివరాలను సీఎం జగన్ ఈ సమీక్షలో వెల్లడించనున్నారు. ఇక, తొలి విడతలో టీడీపీ పట్టు ఉన్న నియోజకవర్గాల పైన సమీక్షలు చేస్తున్న జగన్ డిసెంబర్ నుంచి నిత్యం సమీక్షలు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు పైన వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ఎటువంటి మార్గనిర్దేశం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications