టీటీడీ నూతన ఛైర్మన్ ఖరారు - సాయిరెడ్డికి కీలక బాధ్యతలు...!!
ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ గా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేరు ఖరారైంది. ఈ మేరకు సీఎం జగన్ నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ పదవుల్లోనూ మార్పుల పైన కసరత్తు జరుగుతోంది. పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డికి తిరిగి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. పార్టీ సమన్వయకర్తల్లోనూ కొన్ని మార్పు లు జరగున్నాయి.
టీటీడీకీ నూతన ఛైర్మన్
టీటీడీకీ నూతన ఛైర్మన్..బోర్డు సభ్యుల నియామకం పైన కసరత్తు జరుగుతోంది. ప్రస్తుత పాలకవర్గం గడుడు ఆగస్టు 7వ తేదీతో ముగియనుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్ గా నియమించారు. తొలి టర్మ్ పూర్తయిన తరువాత రెండో సారి సుబ్బారెడ్డినే కొనసాగించాలని సీఎం నిర్ణయించారు.

ఈ సారి సుబ్బారెడ్డి స్థానంలో బీసీ నేత జంగా కృష్ణమూర్తికి ఈ పదవి దక్కనుంది. బోర్డు సభ్యుల పైనా నిర్ణయం తీసుకోనున్నారు. జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీగా..వైసీపీ విప్ గా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ కు మద్దతుగా నిలిచారు. 2019 ఎన్నికల్లో బీసీ అధ్యయన సంఘం కమిటీ ఛైర్మగా వ్యవహరించారు. గతంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా పని చేసారు.
సాయిరెడ్డికి కీలక బాధ్యతలు
సుబ్బారెడ్డికి రెండు సార్లు అవకాశం ఇవ్వటంతో..ఈ సారి బీసీ వర్గానికి ఇవ్వాలని నిర్ణయించారు. తెలుగుదేశం హయాంలో టీటీడీ ఛైర్మన్ గా కడప జిల్లాకు చెందిన సుధాకర్ యాదవ్ వ్యవహరించారు. గుంటూరు జిల్లాకు చెందిన జంగా కృష్ణమూర్తి గతంలో ఎమ్మెల్యేగానూ పని చేసారు. చిత్తూరు జిల్లా నుంచే మరో ఇద్దరు నేతలు టీటీడీ ఛైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేసారు.
సీఎం జగన్ జంగా కృష్ణమూర్తి వైపే మొగ్గు చూపారు. ఇక, పార్టీలోనూ కీలక పదవుల్లో మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. వైవీ సుబ్బారెడ్డి ఇక పూర్తగా పార్టీ బాధ్యతలు పర్యవేక్షించనున్నారు. విజయ సాయిరెడ్డికి పార్టీలో ముఖ్యమైన బాధ్యతలు అప్పగించేలా సీఎం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా పార్టీలో మార్పుల పైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
గోదావరి జిల్లాలపై ఫోకస్
వైసీపీకి నెల్లూరు..ప్రకాశం జిల్లాలు ఈ సారి కీలకం కానున్నాయి. అక్కడ ప్రాంతీయ సమన్వయకర్తగా పని చేసిన మాజీ మంత్రి బాలినేని ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. దీంతో, నెల్లూరు జిల్లా బాధ్యతలు విజయ సాయిరెడ్డికి అధికారికంగా అప్పగించే అవకాశం ఉంది. గోదావరి జిల్లాల సమన్వయకర్తగా ఎంపీ మిథున్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో సమీకరణాలు మారుతున్న సమయంలో..అక్కడ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. కీలక నేతలను అక్కడ మొహరించనున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో బాధ్యతల కారణంగా పార్టీ పదవుల విషయంలో కొందరు నేతలు భారంగా భావిస్తున్నారు. అక్కడా మార్పులకు రంగం సిద్దమైంది. కొత్త వారికి బాధ్యతలను అప్పగించనున్నారు.












Click it and Unblock the Notifications