ఢిల్లీకి సీఎం జగన్ - మారుతున్న లెక్కలు, ఎన్నికల వేళ "సై"..!!
ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు మొదలయ్యాయి. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ చంద్రబాబు సంచలనంగా మారుతోంది. దీని ద్వారా టీడీపీ సానుభూతి వస్తుందనే అంచనాలతో ఉంది. విదేశీ పర్యటనలో ఉన్న జగన్ ఈ రాత్రికి అమరావతికి చేరుకుంటున్నారు. ఈ నెల 13న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇక, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఆపరేషన్ అపోజీషన్ ఢిల్లీ కేంద్రంగా ప్రారంభించనున్నారు.
సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
ముఖ్యమంత్రి జగన్ వై నాట్ 175 లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలోకి నెడుతూ..పూర్తి పై చేయి సాధించేలా జగన్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. జగన్ ను ఓడించటమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ పొత్తు దాదాపు ఖాయమైంది.

బీజేపీ తమతో కలిసి వస్తుందనే అంచనాలతో ఉన్న చంద్రబాబు, పవన్ కు తాజా పరిణామాలతో డైలమాలో పడినట్లు కనిపిస్తోంది. వీటి వెనుక ఢిల్లీ పెద్దలు ఉన్నారా లేదా అనేది మరో ఆసక్తికర చర్చ. దీంతో, పొత్తులపైన తాజా పరిణామాలు ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలోనే లండన్ పర్యటన ముగించుకొని ఈ రాత్రి ఏపీకి తిరిగి వస్తున్న సీఎం జగన్ ఈ నెల 13న ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం.
ఎన్నికలు సిద్దంగా
ఈ నెల 18వ తేదీ నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులు తీసుకురానుంది. అందులో జమిలి, మహిళా బిల్లు, యూసీసీ బిల్లులు పార్లమెంట్ లో ప్రతిపాదిస్తారని చెబుతున్నారు. ఈ బిల్లుల ఆమోదం సమయంలో ఎన్డీఏ పక్షాలతో పాటుగా వైసీపీ, బీజేడీ వంటి పార్టీల మద్దతు కీలకంగా మారుతోంది.

ఈ సమయంలోనే లోక్ సభకు జనవరిలోనే ఎన్నికలు జరిగే అవకాశం పైనా చర్చ సాగుతోంది. లోక్ సభతో పాటుగానే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర అంశాలతో పాటుగా కేంద్రంలో పరిణామాలపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలనేది జగన్ ఆలోచన. కేంద్రంలో ఆలోచనలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ జరిగే అవకాశం ఉంది.
ఆపరేషన్ అపోజీషన్
ఇక, ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్లాలనేది చంద్రబాబు, పవన్ ఆలోచన. తాజా పరిణామాలతో లెక్కలు మారుతున్నాయి. పొత్తులపైన బీజేపీకి సంకేతాలు ఇచ్చినా, ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఇదే సమయంలో బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్ తాజాగా చంద్రబాబుకు తన మద్దతు ఉంటుందని ప్రకటించారు.

టీడీపీ బంద్ లో జనసైనికులు పాల్గొంటున్నారు. బీజేపీ ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. తాజా పరిణామాలతో చంద్రబాబుకు సానుభూతి..అంశాలు కలిసి వస్తాయనే అభిప్రాయాల వేళ..సీఎం జగన్ తన కార్యాచరణ వేగవంతం చేస్తున్నారు. అటు ఢిల్లీ నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన అంశాలపైన ఒత్తిడి పెంచుతూ..రాజకీయంగా ఏపీలో ఎన్నికల వేళ ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ద్విముఖ వ్యూహంతో జగన్ ముందుకు వెళ్లేందుకు రంగం సిద్దమవుతోంది.












Click it and Unblock the Notifications