చివరి రోజున కూటమి పై జగన్ బ్రహ్మాస్త్రం..!!
ఏపీలో పోలింగ్ ముందు ఆసక్తికర రాజకీయం కొనసాగుతుంది. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేందుకు అధినేతలు కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. పోలింగ్ ముందు ఉన్న సమయాన్ని తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. చివరి రోజు ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సంక్షేమ ఓట్ బ్యాంక్ సుస్థిరం చేసుకునేలా కూటమిని టార్గెట్ చేస్తూ తన మార్క్ రాజకీయం ప్రదర్శిస్తున్నారు.
కౌంట్ డౌన్ షురూ
ఏపీలో పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతుంది. ఈరోజు ప్రచారం ముగిసిన తర్వాత 36 గంటలు పోల్ మేనేజ్మెంట్ అభ్యర్థుల గెలుపు ఓటమిలో కీలకం కానుంది. ఈసారి ఎన్నికల్లో సంక్షేమ ఓట్ బ్యాంక్ కీలకపాత్ర పోషించనుంది. జగన్ గత ఐదేళ్ల కాలంగా అమలు చేస్తున్న పథకాలు కొనసాగింపు పై హామీ ఇచ్చారు. అటు చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో హామీలను ప్రకటించారు. కానీ, కూటమినేతలు చివరిలో తమ వ్యూహం మార్చుకున్నారు. కూటమి ప్రకటించిన సంక్షేమ మేనిఫెస్టోకు పెద్దగా ఆదరణ లేదని టిడిపి నేతలు గుర్తించారు. దీంతో జగన్ లక్ష్యంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్.. రిజిస్ట్రేషన్లలో డూప్లికేట్ పత్రాలు ఇస్తున్నారు అంటూ ఈ రెండు అంశాలు ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ రెండిటి ద్వారా జగన్ పైన విశ్వాసం దెబ్బతీసేలా ప్రయత్నం చేశారు.

టీడీపీ ప్రచారం
కానీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూటమిలో భాగస్వామిగా ఉన్న బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయాన్ని వైసిపి ప్రజల్లోకి తీసుకువెళ్లింది. ఈ యాక్ట్ గురించి ప్రధాని మోడీ, అమిషా సమక్షంలో చంద్రబాబు.. పవన్ ఎందుకు మాట్లాడరని నిలదీసింది. అటు బిజెపి నుంచి కొందరు నేతలు దీనిపై ప్రచారం చేయటాన్ని తప్పుపట్టారు. దీంతో టిడిపి, జనసేన ఆత్మ రక్షణలో పడ్డాయి. ఇక రిజిస్ట్రేషన్లకు ఒర్జినల్ ఇవ్వకుండా డూప్లికేట్ ఇస్తున్నారంటూ ప్రచారం చేశారు. దీంతో జగన్ తాజాగా పవన్ కళ్యాణ్, బాలకృష్ణ చేయించుకున్న రిజిస్ట్రేషన్లలో ఒరిజినల్ పత్రాలు ఇచ్చారా లేదా అంటూ ప్రశ్నించారు.
జగన్ మార్క్ నిర్ణయం
ఆ ఇద్దరికి రిజిస్ట్రేషన్ సమయంలో ఒరిజినల్ ఇవ్వడంతో టిడిపి దగ్గర సమాధానం లేదు. ఇక తాజాగా నగదు బదిలీ పథకాలకు నిధులు విడుదల చేయకుండా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వటం వెనుక చంద్రబాబు ఉన్నారని జగన్ ప్రచారం చేశారు. ఎన్నికలు పూర్తికాగానే 14వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని హామీ ఇచ్చారు. రెండు నెలల నుంచి సాగుతున్న పెన్షన్ల వివాదం, ఇప్పుడు పథకాల నగదు బదిలీ అంశం కూటమికి మైనస్ గా మారుతున్నాయని వైసీపీ నేతలు చెప్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలో చివరి రోజున జగన్ తన సంక్షేమ ఓట్ బ్యాంక్ ను మరింత పెంచుకునేలా పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గెలుపు పై ధీమాగా ఉన్నారు.












Click it and Unblock the Notifications