టీడీపీకి సీఎం జగన్ సవాల్, మాస్టర్ ప్లాన్ - ఎక్కడికైనా.. ఎందాకైనా...!!
ముఖ్యమంత్రి జగన్ నినాదం వై నాట్ 175. టీడీపీకి ఎన్నికల సవాల్. మాస్టర్ ప్లాన్ తో ప్రజల్లోకి వెళ్లేలా నిర్ణయం. ప్రత్యర్ధి కూటమిని ఓడించేందుకు ఎక్కడికైనా...ఎందాకైనా సిద్దమంటున్న సీఎం జగన్. ఈ సారి ఎన్నికలను సీఎం జగన్ కురుక్షేత్ర యుద్దంగా ప్రకటించారు. పెత్తందార్లు..పేదలకు మధ్య జరగుతున్న క్లాస్ వార్ గా అభివర్ణించారు. ఇప్పుడు సీఎం మరో కొత్త స్కెచ్ సిద్దం చేసారు. 11 లక్షల 63 వేల మంది సైన్యంతో తో రంగంలోకి దిగారు.
సింహంలా సింగిల్ గా : మీ బిడ్డకు పొత్తుల్లేవు, మీ బిడ్డ వాళ్లమీద వీళ్ల మీద నిలబడడు. మీ బిడ్డ ఒక్కడే, సింహంలా మీ బిడ్డ ఒక్కడే నిలుస్తాడు''- ఇది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫేమస్ డైలాగ్. ఇప్పుడు సోషల్ మీడియాలో, వైసీపీ గ్రూపుల్లో ఈ డైలాగ్ సెన్సేషనల్‌గా మారింది. స్కీంలు కొనసాగాలంటే వైసీపీ ఉండాలని.. పెత్తందార్లు పాలన వస్తే స్కాములు మాత్రమే ఉంటాయని చెబుతున్నారు.

జనసేన, వామపక్షాలు, వీలైతే కాంగ్రెస్‌ను కూడా కలుపుకుని ఈసారి ఎలాగైనా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుప్రణాళికలు వేస్తుండగానే సీఎం జగన్ మోహన్‌రెడ్డి మాత్రం తన భారీ సైన్యంతో ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబునాయుడును అష్టదిగ్భంధనం చేసి, తిరిగి అధికారం చేపట్టేందుకు జగన్ 'ఎందాకైనా'... రెఢీ అయ్యారు.
మాస్టర్ ప్రోగ్రాంకు సిద్దం : తాజాగా పార్టీ నేతల సమావేశంలో సీఎం జగన్ వైనాట్ 175 అన్న టార్గెట్‌ను ఎలా రీచ్ కావాలో, దానికి తన వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటో స్పష్టంగా చెప్పారు. పనిలో పనిగా 18 మంది సిట్టింగులకు టికెట్ లేదని కూడా తేల్చేశారు. వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగన్నర ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంలోని కోటి 60 లక్షల కుటుంబాల వద్దకు తీసుకువెళ్లే మాస్టర్ బ్లాస్టర్ ప్రోగ్రాం జగనన్న సురక్ష గురించి వివరించారు.
2 లక్షల 60 వేలమంది వాలంటీర్లు, లక్షా 50 వేల మంది సచివాలయ సిబ్బంది, 3వేల మంది మండల స్థాయి అధికారులు, 7 లక్షల 50 వేలమంది వైసీపీ గృహ సారథులు, 26 మంది ఐఏఎస్ అధికారులు జగనన్న సురక్ష పేరుతో 30 రోజుల పాటు ప్రజల్లో ఉంబడోతున్నారు. సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు సంతృప్త స్థాయిలో పరిష్కారించే లక్ష్యంగా '1902'తో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు.

11 రకాల సేవలు ఉచితంగా : ఈ ప్రత్యేక క్యాంపుల ద్వారా ఆదాయం, కులం, జనన, మరణ, కొత్త రేషన్ కార్డులు, సీసీఆర్సీ కార్డులు, ఆధార్ కు బ్యాంక్ లింకేజి, ఆధార్ కార్డుల్లో మార్పులు వంటి 11 రకాల సేవలు సర్వీస్ ఛార్జ్ లేకుండా ఉచితంగా అందించనున్నారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులతో కూడిన టీమ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటినీ సందర్శించి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటారు.
ఈ దరఖాస్తులను వారే సచివాలయానికి తీసుకెళ్లి టోకెన్ నంబర్, సర్వీస్ రిక్వెస్ట్ నంబరు క్రియేట్ చేసి వారే తిరిగి ఇంటి వద్దకే వెళ్లి అందిస్తారు. 30 రోజుల్లోగా ఆ సమస్యను పరిష్కరిస్తారు. తన అభివృద్ధి, సంక్షేమ పథకాల మంత్రంతో మరోసారి అధికారం చేపట్టేందుకు అవసరమైన వ్యూహాన్ని సీఎం జగన్ మొదలు పెట్టారు. జగన్ ధాటిని తట్టుకుని ప్రతిపక్షాలు ఎన్నికల రణరంగంలో నెగ్గగలరా. జగన్ ఆ ఛాన్స్ ఇచ్చేందుకు మాత్రం సిద్దంగా లేరనేది సుస్పష్టం












Click it and Unblock the Notifications