ఎన్నికల వేళ మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ - నిధులు జమ..!!
ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అయ్యాయి. టీడీపీ, జనసేన ఇప్పటికే జత కట్టాయి. బీజేపీ వీరితో కలిసి వస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అటు కాంగ్రెస్- వామపక్షాలు కూటమిగా ముందుకొస్తున్నాయి. దీంతో, జగన్ తాను నమ్ముకున్న సంక్షేమం మరోసారి అధికారం ఇస్తుందనే ధీమాతో ఉన్నారు. ఆ సంక్షేమం మరింత ఓట్ బ్యాంక్ పెంచేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు.
మహిళల ఖాతాల్లో నిధులు: ఏపీలో మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ లోగా సీఎం జగన్ సంక్షేమ పథకాల అమలు వేగం పెంచారు. ఎన్నికల మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చే ముందు హామీ ఇచ్చిన మేనిఫెస్టోను ఇప్పటికే 99 శాతం అమలు చేసామని చెబుతున్నారు.

ఇక..ఈ నెలలోనే వైఎస్సార్ చేయూత నిధుల విడుదలకు సీఎం జగన్ నిర్ణయించారు. మార్చి 7న వైఎస్సార్ చేయూత పథకం నిధుల విడుదలకు సీఎం జగన్ ముహూర్తంగా ఖరారు చేసారు. అనకాపల్లి కేంద్రంగా ఈ పథకం నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మందికి పైగా మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతోంది. మార్చి 7 నుంచి 20 వరకూ వైయస్సార్ చేయూత కార్యక్రమం జరుగుతుంది.
చేయూత పథకం అమలు: వైఎస్సార్ చేయూత ఈ పథకం కింద ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు అందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో అట్టడుకు వర్గాల్లో వారికి తోడుగా నిలిచేందుకు ఈ పథకం అమలు చేస్తున్నారు. 45 ఏళ్ల పైబడ్డ ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,750 ఈ పథకం ద్వారా అందిస్తున్నారు. ఈ పథకంలో ఇప్పటివరకు యూనిక్ లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నారు.
ఈ సారి ఈ పథకం అమలు సమయంలో సీఎం జగన్ లబ్దిదారులకు రాసిన లేఖను అందించనున్నారు. ఇక, వచ్చే ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ మేనిఫెస్టో కసరత్తు ముమ్మరం చేసారు. ఈ నెల 10న అద్దంకిలో జరిగే సిద్దం సభలో ఎన్నికల వరాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రైతులు, మహిళలకు సంబంధించి ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.
రైతులు - మహిళలకు వరాలు: దీంతో, పాటుగా ఎన్నికల హామీల్లో భాగంగా ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్ రూ 3 వేల నుంచి దశల వారీగా రూ 4వేలకు పెంపు పైన జగన్ ప్రకటన చేసే అవకాశం ఉంది. అమ్మఒడిలోనూ మరింత మందికి మేలు చేసేలా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. మహిళలకు ఆర్దికంగా తోడ్పాటు అందించేలా హామలు ఉండనున్నట్లు సమాచారం.
రైతు రుణమాఫీ పైన కసరత్తు జరుగుతోందని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఎంత వరకు రుణాల మాఫీపైన హామీ ఇస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే 78.94 లక్షల మందికి వైఎస్సార్ ఆసరా ద్వారా డ్వాక్రా రుణ మాఫీ అమలు చేసారు. దీంతో, మొత్తంగా రైతులు - మహిళల ఓట్ బ్యాంక్ సుస్ధిరం చేసుకొనే దిశగా సీఎం జగన్ ఈ వారంలో నిర్ణయాలు - అమలు దిశగా అడుగులు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications