సీఎం జగన్ ఎన్నిక వరాలు సిద్దం - ముహూర్తం ఖరారు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం కీలక దశకు చేరుకుంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్దుల ఖరారు పై ఒక అంచనాకు వచ్చాయి. ఇక..ఎన్నికల మేనిఫెస్టోల పైన పార్టీలు ఫోకస్ చేసాయి. సీఎం జగన్ తాను అమలు చేసిన సంక్షేమం తిరిగి తనను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ మేనిఫెస్టో ప్రకటించింది. ఇక, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే అమలు చేసే హామీల తో మేని ఫెస్టో ప్రకటను జగన్ సిద్దం అయ్యారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది.
జగన్ కసరత్తు : వచ్చే ఎన్నికల మేనిఫెస్టో పైన సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 10న అద్దంకి వద్ద జరిగే నాలుగో సిద్దం సభా వేదికగా ఎన్నికల వరాలు ప్రకటిస్తారని తెలుస్తోంది. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేసామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను కొనసాగిస్తూనే మరి కొన్ని చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా రైతు రుణ మాఫీ పైన ప్రకటన ఉంటుందని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రూ లక్ష వరకు ఈ మాఫీ ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. దీంతో,పాటుగా డ్వాక్రా మహిళలకు ఆర్దిక సాయం, పెన్షన్ రూ 3 వేల నుంచి రూ 4 వేలకు పెంపు, అమ్మఒడి ఇద్దరు పిల్లలకు వర్తించేలా నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఎన్నికల హామీలు : టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలను ప్రకటించింది. ఎక్కడా ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా జగన్ నిర్ణయాలు ఉంటాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్యులతో జగన్ మేనిఫెస్టో పైన చర్చించారు. ఈ నెల 10న జరిగే సిద్దం సభ ద్వారా ఇక ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. సీఎం జగన్ జిల్లాల వారీగా ఎన్నికల ప్రచారానికి హాజరయ్యేలా షెడ్యూల్ సిద్దం అవుతోంది. ఈ సమయంలో నాలుగో సిద్దం సభ తొలి మూడు సభలను అధిగమించేలా ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ సిద్దం సభ బాధ్యతలను సాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. సిద్ధం సభకు ఆరు పార్లమెంట్ ప్రాంతాల నుంచి 43 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు వస్తారన్నారు.

సిద్దం సభలో ప్రకటన : భిమిలీలో మొదటి సభ, తరువాత ఏలూరు, ఆ తరువాత రాప్తాడులో సిద్ధం సభలు నిర్వహించామన్నారు. ఈ రోజు రాష్ట్రంలో బీసీలంతా వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ వైపు ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో మాకు మద్దతుగా నిలుస్తారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. తప్పకుండా మా టార్గెట్ 175కు 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మేం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటామన్నారు. సిద్ధం మహాసభకు వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. సభలో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిద్ధం సభ తప్పకుండా విజయవంతం అవుతుందన్నారు. దీంతో, ఈ సభ ద్వారా సీఎం జగన్ ఎలాంటి ఎన్నికల వరాలు ప్రకటిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications