నేడు పారిస్ కు సీఎం జగన్ - సతీ సమేతంగా : ప్రధాని పర్యటన వేళ..!!
ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ రాత్రికి సీఎం జగన్ సతీసమేతంగా పారిస్ కు బయల్దేరుతారు. గన్నవరం నుంచి వెళ్తారు. రేపు (బుధవారం) పారిస్ చేరుకుంటారు. సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్షా రెడ్డి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రతిష్టాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు. జూలై 2న హర్షా రెడ్డి చదువుతున్న యూనివర్సిటీ కాన్వకేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ కార్యక్రమం ముగిసిన తరువాత ఆయన తిరిగి ఏపీకి బయల్దేరుతారు. జూలై 4న ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు రానున్నారు.

4న రాష్ట్రానికి ప్రధాని మోదీ
భీమవరంలో జరిగే అల్లూరి సీతారామ రాజు 125వ జయంతోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. జూలై 2,3 తేదీల్లో ప్రధాని హైదరాబాద్ లోనే ఉండనున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన పార్టీ ముఖ్య నేతలతో కలిసి పాల్గొంటారు. జగన్ సీఎం అయిన తరువాత తిరుమల పర్యటనలకు మాత్రమే వచ్చిన ప్రధాని..ఇప్పుడు ఏపీలో ఇతర జిల్లాలకు అధికారిక హోదాలో రావటంతో ఇదే తొలి సారి. భీమవరంలో జరిగే కార్యక్రమానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. 4వ తేదీ ఉదయం హైదరాబాద్ నుంచి ప్రధాని మోదీ భీమవరం చేరుకుంటారు.

రాష్ట్రపతి పర్యటన - ప్రచారం
ఆ కార్యక్రమంలో సీఎం సైతం పాల్గొనున్నారు. ఇక, 4 లేదా 5వ తేదీల్లో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపదీ ముర్ము సైతం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించే అవకాశం ఉందని సమాచారం. ముర్ము తెలుగు రాష్ట్రాల పర్యవేక్షణ బాధ్యత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చూస్తున్నారు. ఇప్పటికే వైసీపీ ముర్ముకు మద్దతు ప్రకటించింది. ఏపీ నుంచి ఎలక్టోరల్ కాలేజ్ లో ఓటు హక్కు కలిగిన వారితో కలిసి..మద్దతు కోరేందుకు ముర్ము ఏపీకి రానున్నారు. ఇక, జూలై 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ జరగనుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి ప్లీనరీ కావటంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు.

పార్టీ ప్లీనరీ - బిజీ షెడ్యూల్
ఇప్పటికే కమిటీల నియామకం సైతం చేసారు. పార్టీ పరంగా పలు కీలక తీర్మానాలను ప్రవేశ పెట్టనున్నారు. దీంతో.. పారిస్ లో తన కుమార్తె చదువుతున్న యూనివర్సిటీ కాన్వకేషన్ కార్యక్రమం పూర్తయిన వెంటనే సీఎం జగన్ తిరిగి రానున్నారు. అప్పటి నుంచి జూలై 9వ తేదీ వరకు పూర్తిగా బిజీ షెడ్యూల్ ఉంది. ఇక, జూలై రెండో వారంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైన ఆలోచన చేస్తున్నారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక ఉండటంతో..ఈ ఎన్నికకు ముందే సమావేశాలు ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications