ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక హామీ..!!
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్టోబరు-డిసెంబరు 2023 త్రైమాసికానికి సంబంధించి 9.44 లక్షల మంది విద్యార్థులకు మంచిచేస్తూ రూ.708.68 కోట్లను సీఎం వైయస్ జగన్ విడుదల చేసారు. ఇదే సమయంలో పేద విద్యార్ధులకు చదువులు అందాలి...ఆర్దికంగా తోడ్పాటు కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందని స్పష్టం చేసారు. చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలన్నారు.
విద్యా దీవెన నిధులు విడుదల : ముఖ్యమంత్రి జగన్ పామర్రు వేదికగా జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసారు. విద్యాదీవెనతో పేదింటి పిల్లలు చక్కగా చదవుకుంటున్నారని జగన్ చెప్పారు. క్రమం తప్పకుండా విద్యాదీవెన నిధులు అందిస్తున్నామన్నారు. విద్యా దీవెనతో 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి కలిగిందన్నారు. ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లింపు చేస్తున్నట్లు వివరించారు. పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జగన్ స్పష్టం చేసారు. జగనన్న విద్యాదీవెనతో ఇప్పటివరకు రూ.12,610 కోట్లు అదించినట్లు వెల్లడించారు. వసతిదీవెన, విద్యాదీవెన కోసం ఇప్పటి వరకు రూ.18 వేల కోట్లు వెచ్చించామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

విప్లవాత్మక మార్పులు : ఎప్పుడూ చూడని విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని జగన్ వెల్లడించారు. విద్యారంగంలో ఇప్పటి వరకూ రూ. 73 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. కేవలం పిల్లల చదువుల కోసమే 57 నెలల కాలంలో రూ. 73 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. తర్వాతి తరాలకు మనం అందించే గొప్ప ఆస్తి చదువేనని జగన్ స్పష్టం చేసారు. ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. ఈరోజు క్వాలిటీతో ఉన్న చదువులే మన పిల్లలకు కావాలన్నారు. క్వాలిటీ చదవుల అవసరం తెలుసుకున్నాం కాబట్టే విప్లవాత్మక మార్పులు అమలు చేస్తున్నామని జగన్ వివరించారు. మన పిల్లలు పోటీ ప్రపంచంలో అత్యుత్తమ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

అప్రమత్తం కావాలి : ప్రభుత్వ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే ప్రతిపక్షాలు విమర్శలు చేసామన్నారు. పెత్తందారుల కుట్రలు గమనించాలని జగన్ కోరారు. పేదల పిల్లలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోవాలన్న పెత్తందారుల మనస్తత్వం గమనించాలని సూచించారు. పెత్తందారులతో మనం క్లాస్ వార్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చామని చెప్పారు. పేద పిల్లల భవిష్యత్తు మార్చేందుకు ఎప్పుడైనా చంద్రబాబు ప్రయత్నించారా అని నిలదీసారు. ప్రతిపక్షాలు చెప్పే అబద్ధాలు నమ్మొద్దని సీఎం జగన్ కోరారు. ప్రతీ ఇంట్లో మంచి జరిగి ఉంటే జగన్‌కు ఓటు వేయండని ముఖ్యమంత్రి సూచించారు. వైసీపీ ప్రభుత్వం రాకుంటే పిల్లల చదువులు, సంక్షేమ పథకాలు అన్నీ ఆగిపోతాయని జగన్ అప్రమత్తం చేసారు.












Click it and Unblock the Notifications