తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసిన ముఖ్యమంత్రి జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ రూ.87.30 కోట్ల డబ్బును పెళ్లి కూతుళ్ల తల్లుల ఖాతాల్లో జమ చేసారు. డిగ్రీదాకా పేద పిల్లల చదువుల భారం ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. అమ్మ ఒడి, విద్యా దీవెన,వసతి దీవెన పథకాలు ఉన్నందున కనీసం డిగ్రీ వరకు చదువుకుంటారని చెప్పారు. అందుకే వైయస్‌ఆర్ కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాలకు కనీసం పదో తరగతి అర్హత పెట్టామన్నారు. చదువు అనే దివ్యాస్త్రంతో పేదరికం నుంచి బయటపడవచ్చని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.
రూ 87.32 కోట్ల నిధులు జమ : జనవరి-మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు రూ.87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గత ఆరు నెలల్లోనే ఈ పథకాల కింద 16,668 మంది లబ్ధిదారులకు మేలు జరిగింది. వీరి ఖాతాల్లో ప్రభుత్వం ఏకంగా రూ.125.50 కోట్లు జమ చేసింది.

నూతన జంటలతో ముఖ్యమంత్రి జగన్ వర్చువల్‌గా మాట్లాడారు. పదో తరగతి చదివితేనే కళ్యాణమస్తు, షాదీతోఫా లభిస్తుందని అర్థం చేసుకుంటారో..అప్పుడే పదో తరగతి వరకు కచ్చితంగా చదివించాలనే తపన వస్తుంది. దీనికి తోడు కచ్చితంగా 18 ఏళ్ల వయసు అమ్మాయికి ఉండాలి. అబ్బాయికి 21 ఏళ్లు ఉండాలనే నిబంధన పెట్టామని వివరించారు.
గత ప్రభుత్వంలో ఇలా : గత ప్రభుత్వం 17,709 మంది జంటలకు ఇచ్చేదే తక్కువ..ఇచ్చే దాంట్లో కూడా ఎగురగొట్టారు. గత ప్రభుత్వం దాదాపుగా రూ.70 కోట్లు ఎగురగొట్టారని ఆరోపించారు. అప్పటి కన్న మన ప్రభుత్వం మనసు పెట్టి పేద జంటలకు మంచి జరగాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేస్తూ నాఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనారిటీ కుటుంబాలకు మంచి జరగాలని అడుగులు వేశామని చెప్పారు.
15 ఏళ్ల వయసుకు పదో తరగతి అయిపోతే..18 ఏళ్ల వరకు ఆగాలి కాబట్టి..ఎలాగు మన ప్రభుత్వం పిల్లలను బడిబాట పట్టించేందుకు అమ్మ ఒడి కార్యక్రమం అమలు చేస్తున్నాం. కాబట్టి 18 ఏళ్ల వరకు చదివించుకోవచ్చని ముఖ్యమంత్రి వివరించారు. ఇచ్చామంటే ఇచ్చామన్నట్లుగా, చేశామంటే చేస్తున్నట్లుగా ..ఎన్నికల కోసం చేస్తున్నట్లుగా కాకుండా, గత ప్రభుత్వానికి భిన్నంగా చిత్తశుద్ధితో వైయస్‌ఆర్ కళ్యాణమస్తును రూపకల్పన చేశామన్నారు.

పెంచి అందిస్తున్నాం : గతంలో ఎస్సీలకు రూ.40 వేలు ఇచ్చిందని గుర్తు చేసారు. ఆ పరిస్థితిని మార్చి ప్రస్తుత ప్రభుత్వం ఏకంగా రూ.లక్షకు తీసుకునిపోయామని చెప్పారు. ఎస్టీలకు దాదాపుగా రూ.50 వేలు గత ప్రభుత్వం ఇచ్చేది..దాంట్లో కూడా ఎగురగొట్టే పరిస్థితి ఉండేదని ఆరోపించారు. దాన్ని కూడా మనం ఏకంగా లక్ష రూపాయలకు తీసుకెళ్లామని వివరించారు.
బీసీలకు గతంలో రూ.30 వేలు ఇచ్చే పరిస్థితి ..దాన్ని రూ.50 వేలకు పెంచినట్లు గుర్తు చేసారు మైనారిటీలకు గతంలో రూ.50 వేలు ఇస్తే..మనం రూ.లక్ష దాకా ఇస్తున్నాం. విభిన్న ప్రతిభావంతులకు రూ.1.50 లక్షలకు పెంచామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వస్తాయని గట్టిగా నమ్మి ప్రతి అడుగు ఆ దిశగా వేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ వివరించారు.












Click it and Unblock the Notifications