తిరుపతిలో వైసీపీ గెలుపు దేశం చూడాలి- అతి విశ్వాసం వద్దు- జగన్ వ్యాఖ్యలు
ఏపీలో వచ్చే నెల 17న జరిగే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. వైసీపీ, టీడీపీ, బీజేపీ-జనసేన కూటమి మధ్య త్రిముఖ పోరు జరుగుతుందని భావిస్తున్న ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఆయా పార్టీలు వ్యూహరచనలో మునిగి తేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ వైసీపీ నేతలతో ఇవాళ సమావేశమయ్యారు. తిరుపతి ఎన్నికపై నేతలతో ఆయన చర్చించారు.
తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ గురుమూర్తిని ఇప్పటికే ఎంపిక చేశారు. ఆయన్ను ఇవాళ సీఎం జగన్ పార్టీ నేతలకు పరిచయం చేశారు. అనంతరం మాట్లాడిన జగన్.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. దేశం మొత్తం ఏపీవైపు చూసేలా ఫలితాలు ఉండాలని నేతల్ని ఆదేశించారు. ఇందుకు తగిన విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్న అంశాన్ని జనంలోకి తీసుకెళ్లాలన్నారు.

తిరుపతిలో ప్రతీ గడపకూ వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించాలని నేతలకు జగన్ సూచించారు. రాబోయే రోజుల్లో ఇదే ఒరవడి కొనసాగిస్తామని హామీ ఇవ్వాలని తెలిపారు. తిరుపతిలో వైసీపీకి వచ్చే మెజారిటీ మన మెసేజ్‌గా ఉండాలన్నారు. ప్రతీ ఓటరుకూ తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని వివరించాలని నేతలకు జగన్ సూచన చేశారు. అతి విశ్వాసానికి వెళ్లొద్దని కూడా నేతల్ని జగన్ కోరారు. నేతలంతా సమన్వయంతో పనిచేసి గురుమూర్తిని మంచి మెజారిటీతో గెలిపించాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications