నా నమ్మకం అదొక్కటే - కోరుకొనేది ఒక్కటే : సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!
ఇది అన్ని వర్గాల సామాజిక ప్రభుత్వం, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేదవర్గాల గురించి నిరంతరం ఆలోచన చేసే ప్రభుత్వం మీది, మనది అన్నది గుర్తు పెట్టుకోవాలని సీఎం జగన్ కోరారు. విశాఖ లో వాహనమిత్ర ఆర్దిక సాయం విడుదల చేసారు. ఆ సమయంలో జగన్ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను వివరించారు. దుష్టచతుష్టయం అంటూ ఫైర్ అయ్యారు. నాడు చంద్రబాబు సీఎంగా ఉండగా.. నేడు తాను సీఎంగా ఉన్నానని జగన్ చెప్పుకొచ్చారు. కానీ, నాడు జరగని మంచి ..ఈ రోజు జరుగుతోందని గుర్తించాలని సూచించారు. నాడు ఈ మంచి పనులు ఎందుకు చేయలేకపోయారంటూ ప్రశ్నించారు.

వాటినే నమ్ముకుంటున్నాను
తనకు నాలుగైదు మీడియా సంస్థలు లేవని..తనకు ఉన్నది నిబద్దత..నిజాయితీ అని చెప్పుకొచ్చారు. ప్రజల తోడు - దేవుడి ఆశీస్సులు మాత్రమే తాను నమ్ముకుంటానంటూ జగన్ వ్యాఖ్యానించారు. తాను ప్రజల మీద. .దేవుడి దయ మీద ఆధారపడతానంటూ సీఎం పేర్కొన్నారు. నాటి ప్రభుత్వంలో దోచుకో..దాచుకో అనే తీరిన పాలన సాగిందని విమర్శించారు. వాహన మిత్ర ద్వారా వరుసగా నాలుగో ఏడాది మనందరి ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం సామాన్యుడి పట్ల, సమాజం పట్ల మన బాధ్యత ఏ స్థాయిలో చేస్తున్నామో ఇది ఒక నిదర్శనమని వివరించారు.

ఇచ్చిన మాట నిలబెట్టకుంటున్నా
ఈ ఏడాది 2,61,516 మంది కుటుంబాలకు మంచి చేస్తూ ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.261 కోట్ల ఆర్థికసాయం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వాహనాలకు సంబంధించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు కచ్చితంగా ఉండేలా చూసుకోండని సీఎం సూచించారు. ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోవాలన్నారు. మీ వెనుక ప్రయాణికులు ఉన్నారు. వారి జీవితాలు కూడా మన చేతుల్లో ఉన్నాయన్న విషయాన్ని ఎప్పుడూ మరిచిపోవద్దని కోరుతున్నానంటూ సీఎం చెప్పుకొచ్చారు. ఈ రోజు అందిస్తున్న రూ.261.52 కోట్లతో పాటు గతంలో ఇచ్చిన సాయాన్ని కలుపుకుంటే అక్షరాల రూ.1026 కోట్లు అని సగర్వంగా తెలియజేస్తున్నానని చెప్పారు.

నాలుగు విడతలుగా సాయం అందిస్తూ
ఒక్కొక్కరికి రూ.40 వేల దాకా ఇచ్చినట్లు అవుతుందని వివరించారు. ఆటో డ్రైవర్లను ప్రోత్సహించడం, సహాయం చేయడమే మన ప్రభుత్వంలో చూస్తున్నామన్నారు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం, ఇన్సూరెన్స్ కోసం ఎక్కడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఈ ప్రభుత్వంలో లేవని చెప్పారు. డ్రైవర్లకు తోడుగా ఉంటూ నడిపిస్తున్నామని చెప్పుకొచ్చారు. నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని చెప్పిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే వాహనమిత్ర పథకం ప్రారంభించామని సీఎం జగన్ అన్నారు. కరోనా సమయంలోనూ వాహన మిత్ర పథకం అమలు చేశాం. మనది పేదల ప్రభుత్వం.. పేదలకు అండగా ఉండే ప్రభుత్వమని సీఎం చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications