CM Jagan ప్రధానికి లేఖ :తెలంగాణ ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది: కేంద్ర బలగాలను ఇవ్వండి..
ఏపీ -తెలంగాణ మధ్య సాగుతున్న నీటి వివాదం పైన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీతో పాటుగా జలశక్తి మంత్రి షెకావత్ కు విడి విడిగా లేఖలు రాసారు. ఏపీ కేబినెట్ లో నిర్ణయించిన విధంగా.. జరుగుతున్న పరిణామాల క్రమాన్ని అందులో వివరంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. విద్యుతుత్పత్తి పేరిట తెలంగాణ వాడుకుంటున్న కృష్ణా జలాలను తక్షణం నిలిపివేయాలని కోరుతూ 14 పేజీల లేఖను రాసారు.
అదే విధంగా అక్రమంగా వాడిన నీటిని తెలంగాణ కోటాలో కలపాలని కోరారు. తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీలలో ఈ నీటిని కలపాలని సీఎం సూచించారు. ఏపీ ప్రయోజనాలు దెబ్బతినేలా తెలంగాణ వ్యవహరిస్తోందని లేఖల్లో పేర్కొన్నారు. నీటి వినియోగంపై తెలంగాణ తీరును తప్పుబడుతూ ఈ లేఖలను పంపారు. విద్యుదుత్పత్తికి ఏకపక్షంగా నీటిని వినియోగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలను ఉల్లంఘించిందని సీఎం జగన్ ఆక్షేపించారు. తెలంగాణ ఉల్లంఘనలపై కేఆర్‌ఎంబీకి రాసిన లేఖలను జతపరిచారు.

నీటి వినియోగంపై తెలంగాణ తీరును తప్పుబడుతూ లేఖ లో ఏ రకంగా నీటిని వినియోగిస్తోందీ సీఎం జగన్ వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో ఏకపక్షంగా విద్యుదుత్పత్తి కోసం నీటిని వినియోగిస్తున్నారని తెలంగాణపై ఫిర్యాదు చేసారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఉల్లంఘనలపై కేఆర్‌ఎంబీకి రాసిన లేఖలను జతపరిచిన జగన్ బోర్డు తీరు గురించి అందులో వివరించారు. జల వివాదాల విషయంలో ప్రధాన మంత్రి జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు.
దీంతో పాటుగా.. ఉమ్మడి ప్రాజెక్టు ల వద్ద సీఐ ఎస్ ఎఫ్ బలగాలను మోహరించాలని ప్రధానితో పాటుగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి సీఎం సూచించారు. నీటి వినియోగం, జలాల పంపకాల విషయం లో కేఆర్ ఎంబి పరిధిని నిర్దేశించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇప్పుడు ఏపీ సీఎం లేఖల పైన కేంద్రం నుండి ప్రధానంగా ప్రధాని మోదీ వద్ద నుండి ఎటువంటి స్పందన వస్తుందనేది వేచి చూడాలి. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఈ లేఖల విషయంలో ఏ రకంగా స్పందిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications