సీఎం జగన్ 2024 ఎలక్షన్ టీం రెడీ : ఆ ఇద్దరిని ఏరి కోరి కీలక స్థానాల్లో - ప్రక్షాళన షురూ..!!
ముఖ్యమంత్రి జగన్ తన ఎన్నికల టీం ను సిద్దం చేసుకుంటున్నారు. తొలుత తన కార్యాలయం నుంచే ప్రక్షాళన ప్రారంభించిన సీఎం..ఇప్పుడు ఏరి కోరి ఎంపిక చేసుకున్న అధికారులను కీలక స్థానాల్లో నియమిస్తున్నారు. తన కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ ను బదిలీ చేసిన తరువాత...డీజీపీ గౌతమ్ సవాంగ్ ను సైతం మార్చేసారు. నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంధ్ర నాద్ రెడ్డిని నియమించారు. ఆయన ఎన్నికల వరకూ డీజీపీగా కొనసాగే అవకాశం ఉంది. ఇక, తన కార్యాలయంతో పాటుగా... తన పాలనకు కీలకమైన నిఘా చీఫ్ బాధ్యతలను ఏరి కోరుకున్న అధికారులకు అప్పగించారు.

ప్రక్షాళన మొదలైందా
రాజకీయంగానూ ప్రభుత్వం..పార్టీలో ప్రక్షాళనకు సిద్దమైన సీఎం జగన్ ముందుగా అధికార వ్యవస్థపైన ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా... కీలక స్థానాల్లో అధికారులను మార్పు చేసారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కీలక స్థానాల్లో ఉన్న కొందరిని మార్చడంతో పాటు ఇంకొందరికి అదనపు బాధ్యతలు అప్పగించింది.
జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డిని ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ఈవోగానూ ఆయన అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని పేర్కొంది.

జవహర్ రెడ్డికి కీలక స్థానం
గతంలో కూడా ఆయనకు కీలక సమయాల్లో కీలక బాధ్యతలు అప్పగించారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ముఖ్య పాత్ర పోషించారు. ఆ తర్వాత టీటీడీ ఈవోగా పోస్టింగ్ ఇచ్చారు. మళ్లీ కొవిడ్ సమయంలో ఒకపక్క టీటీడీ ఈవోగా ఉంటూనే.. కొవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.
కరోనా ముగిసిన తరువాత జవహర్ రెడ్డి తాను టీటీడీలో శ్రీవారి సేవలోనే ఉండాలనేది తన కోరిక గా చెప్పటంతో ఆయనను టీటీడీ ఈవోగానే కొనసాగిస్తూ ఇరిగేషన్ బాధ్యతలు అప్పగించింది. ఇక, ఇప్పుడు సీఎంఓలో ప్రవీణ్ ప్రకాశ్ బదిలీతో జవహర్ రెడ్డి ని సీఎం తన కార్యాలయంలోకి తీసుకున్నారు. గతంలోనే జవహర్ రెడ్డి సీఎంఓలోకి రావాల్సి ఉన్నా.. కొన్ని సమీకరణాల కారణంగా సాధ్యపడలేదు.

నిఘా చీఫ్ గా ఏరి కోరి పీఎస్సార్ కు
ఇక, ఇదే సమయంలో కీలకమైన నిఘా చీఫ్ బాధ్యతలను సీఎం జగన్ సీనియర్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుకు అప్పగించారు. జగన్ సీఎం అయిన తరువాత పీఎస్ఆర్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తూ వచ్చారు. ఆయన ఏసీబీ డీజీగా, రవాణా శాఖ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏపీపీఎస్సీ సెక్రటరీగానూ పీఎస్సార్ కీలకంగా పని చేసారు.
ఇక, ఇప్పుడు వచ్చే ఎన్నికలకు సమాయత్తంలో భాగంగా కీలకమైన నిఘా చీఫ్ బాధ్యతలను పీఎస్సార్ కు అప్పగించారు. మరోవైపు.. డీజీపీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆ బాధ్యతల్లో కొనసాగిస్తూనే నిఘా విభాగం నుంచి ఏసీబీ డీజీగా బదిలీ చేసింది. డీజీపీగా పూర్తి స్థాయిలో ఆయన నియామకానికి కేంద్రం నుంచి అనుమతి రావలసి ఉంది.

కీలక స్థానాల్లో మార్పులు
అంతవరకూ సాంకేతికంగా ఏదో ఒక పోస్టులో ఉండాలి కాబట్టి ఆయన్ను ఏసీబీ డీజీగా నియమిస్తూ.. డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నామని పేర్కొంది. మరోవైపు విజిలెన్స్-ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా శంకబ్రత బాగ్చీని బదిలీ చేశారు. ఇప్పటివరకు కసిరెడ్డి చూసిన ఈ విభాగాన్ని ఆయనకు అప్పగించారు.
మరి కొన్ని కీలక బాధ్యతల విషయంలోనూ అధికారులను మార్చే అవకాశం ఉందని సమాచారం. భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ)గా చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన కార్యాలయంలో కీలక భూమిక పోషించిన జి.సాయిప్రసాద్‌ను నియమించింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(ల్యాండ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్)గా కూడా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

మిషన్ 2024 లక్ష్యంగా నిర్ణయాలు
రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎంటీ కృష్ణబాబుకు రవాణా శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కార్యదర్శిగా ఉన్న శశిభూషణ్ కుమార్ మళ్లీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన జీఏడీ కార్యదర్శి బాధ్యతలనూ అదనంగా నిర్వర్తిస్తారు.
దీంతో..అధికార యంత్రాంగంలో ప్రక్షాళన ఒక కొలిక్కి రావటంతో.. కొత్త జిల్లాల ఏర్పాటు లోగా రాష్ట్ర స్థాయిలో పూర్తిగా మార్పులు చేర్పులు పూర్తి చేసే అవకాశం ఉంది. ఆ వెంటనే రాజకీయంగానూ కేబినెట్ విస్తరణ.. పార్టీలోనూ కీలక మార్పుల దిశగా సీఎం అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. మరి కొద్ది రోజుల్లో సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి కానుంది. మిగిలిన కాలం వేగంగా అడుగులు వేసే దిశగా సీఎం జగన్ సమూల మార్పులకు ...ప్రక్షాళనకు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీంతో..రానున్న రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు ఉంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications