కుటుంబాలను చీల్చుతున్నారు, పొత్తులతో వస్తున్నారు - జగన్ సంచలనం..!!
ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో తనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కుట్రల రాజకీయాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కుటుంబాలను చీల్చుతున్నారని పరోక్షంగా షర్మిల అంశాన్ని ప్రస్తావించారు. మరింతగా పొత్తులు ఎక్కువగా పెట్టుకొంటారని చెప్పుకొచ్చారు. అప్రమత్తంగా ఉండాలని కోరారు. తాను దేవుడిని..ప్రజలను నమ్ముకున్నానని పేర్కొన్నారు.తన ధైర్యం ప్రజలేనని ముఖ్యమంత్రిస్పష్టం చేసారు.
కాకినాడలో జగన్ : ఏపీ ప్రభుత్వం ఈ నెల వైఎస్సార్ పెన్షన్ కానుక రూ 3 వేలకు పెంచింది. 66,34,742 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసే పింఛన్ల మొత్తం రూ.1,967.34 కోట్లు విడుదల చేయగా, ఇందుకు సంబంధించిన మెగాచెక్‌ను ముఖ్యమంత్రి కాకినాడలో ఆవిష్కరించారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.3వేలకు పెన్షన్ పెంచామని చెప్పుకొచ్చారు. పెన్షన్‌ల కోసం దాదాపుగా నెలకు రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. పండుగైనా, సెలవైనా ఒకటో తేదీనే పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు. జగనన్న సైన్యం వలంటీర్లు పెన్షన్ పంపిణీ చేస్తున్నారని వివరించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పెన్షన్ రూ.58వేలు మాత్రమే ఇచ్చారని.. ప్రస్తుత ప్రభుత్వంలో రూ.లక్షా 47వేలు అందిస్తున్నామని వెల్లడించారు.

కుటుంబాలను చీల్చుతున్నారు : చంద్రబాబు, పవన్ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. పేదలకు మూడు సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదన్నారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించారని ఎద్దేవా చేసారు. చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కల్యాణ్ కూడా భాగస్వామి అంటూ ఆరోపించారు. చంద్రబాబు అవినీతి గురించి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆధారాలు సేకరించాయని..కోర్టులు నిర్దారించాయని జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు రూ 2.46 లక్షల కోట్లు పేదలకు ప్రభుత్వం ద్వారా లబ్ది అందిందని ముఖ్యమంత్రి వివరించారు.

ప్రజలనే నమ్ముకున్నాను : రాజకీయంగానూ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. 2014-19 కాలంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయిన వాళ్లు ఇప్పుడు కొత్త హామీలతో ప్రజల మధ్యకు వస్తున్నారన్నారు. కుటుంబాలను చీల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని చెప్పుకొచ్చారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొత్తులు, ఎత్తులు, కుయుక్తులు, జిత్తులతో వస్తున్నారని జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. తనకు వారి లాగా అబద్దాలు చెప్పటం, కుట్రలు చేయటం తెలియదన్నారు. తాను మంచి చేసానని నమ్మిన ప్రతీ ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. గతంలో జరగని మంచి ఒక వ్యక్తి సీఎం పదవిలో మారటం వలన జరిగిందనేది గుర్తుంచుకోవాలని సూచించారు. తన హాయంలో అమలవుతున్న పథకాలను వివరించారు. తాను ప్రజలనే నమ్ముకున్నానని సీఎం జగన్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications