Odisha train accident: రైలు ప్రమాదం పై సీఎం జగన్ ఆరా, ఆదేశాలు..!!
ఒడిశా రైలు ప్రమాదంలో భారీ విషాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 237 మంది మరణించినట్లు అధికారికంగా వెల్లడించారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ రైలు ప్రమాదం పైన ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదం పై విచారం వ్యక్తం చేసారు. మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు.
సీఎం జగన్ కీలక సూచనలు: ఒడిశాలో జరిగిన ప్రమాదం పైన ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. పెద్ద సంఖ్యలో మరణాల పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రం నుంచి ఎవరైనా ఉన్నారా..లేదా అనే దాని పైన ప్రధానంగా దృష్టిపెట్టాలని నిర్దేశించారు.
రైల్వే అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులనుంచి నిరంతరం సమాచారం తెప్పించుకోవాలన్నారు. ఒడిశా ప్రభుత్వంతో పాటుగా రైల్వే అధికారులతో ఏపీ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.

ఏపీ ప్రయాణీకుల పై ఆరా: రైల్వే ప్రమాద ఘటనలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో ఏపీ నుంచి ఎంత మంది ప్రయాణీకులు ఉన్నారనే సమాచారం పై అధికారులు ఆరా తీస్తున్నారు. షాలిమార్, సంత్రగచ్చి, ఖరగ్ పూర్, బాలేశ్వర్ స్టేషన్లలో ఎక్కిన ప్రయాణీకుల్లో విజయవాడలో 47 మంది, రాజమహేంద్రవరంలో 22 మంది, ఏలూరుకు ఒక్కరు కలిపి మొత్తంగా 70 మంది వరకు దిగాల్సి ఉంది.
దీంతో, ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. క్షతగాత్రుల వివరాలు అందించేందుకు హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటివరకు 5 రాష్ట్రాల్లో సహాయక కేంద్రాలు పెట్టారు. ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగాల్, కర్ణాటకల్లో హెల్ప్ లైన్స్ ద్వారా సమాచారం అందిచేందుకు ఏర్పాట్లు చేసింది.
హెల్ప్ లైన్లు ఏర్పాటు: ఏపీలో పలు రైల్వే స్టేషన్లలో హెల్ప్ లైన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. విశాఖ: 08912 746330, 08912 744619, విజయనగరం: 08922-221202, 08922-221206, విజయవాడ: 0866 2576924, రాజమండ్రి: 0883 2420541, రేణిగుంట: 9949198414, సికింద్రాబాద్: 040 27788516, తిరుపతి: 7815915571, నెల్లూరు: 08612342028 నెంబర్లలో సహాయం..సమాచారం కోసం సంప్రదించాలని అధికారులు సూచించారు.
ఏపీలోని పలు ప్రాంతాలక రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణీకుల నుంచి ప్రమాదం పైన సమాచారం సేకరిస్తున్నారు. అవసరమైన సాయం అందించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. క్షతగాతులను ఒడిశాలోని పలు ప్రాంతాల్లోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సహాయక చర్యలను రైల్వే మంత్రి అశ్విణీ వైష్ణవ్ పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications