మంచు కొండల కింద మరో ప్రపంచం.. గోండ్వానా చరిత్రను ప్రతిబింబించేలా..
ఆరుగాలం మంచుతో గడ్డకట్టుకుపోయే అంటార్కిటికా ఖండం నిగర్భంలో భూమి పుట్టుకకు సంబంధించిన ఒక భారీ రహస్యం బద్దలైంది. కొన్ని కిలోమీటర్ల మేర దట్టంగా పేరుకుపోయిన మంచు పొరల కింద శాస్త్రవేత్తలు ఒక ఊహించని భారీ భౌగోళిక నిర్మాణాన్ని కనుగొన్నారు. 'నేచర్ జియోసైన్స్' అంతర్జాతీయ పత్రికలో ప్రచురితమైన ఈ సంచలన ఆవిష్కరణ, భూగోళ శాస్త్రవేత్తలను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా, అంటార్కిటికా ఖండం ఆవిర్భావ చరిత్రను పూర్తిగా మార్చిరాసేలా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తూర్పు అంటార్కిటికా మంచు ఫలకాల కింద, సుమారు మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతులో ఈ అసాధారణ ఆకృతి దాగి ఉంది. గతంలో ఇక్కడ విడివిడిగా కొన్ని చిన్న బేసిన్‌లు మాత్రమే ఉన్నాయని భావించినప్పటికీ, తాజా పరిశోధనలు అవన్నీ ఒకే అతిపెద్ద ఆకృతిలో భాగమని తేల్చాయి. ఒక భారీ విసనకర్ర (Fan-shaped) ఆకారంలో ఉండి, అనేక ఉప-సముద్రపు బేసిన్‌లను అనుసంధానిస్తున్న ఈ విశాలమైన నిర్మాణానికి పరిశోధకులు 'ఈస్ట్ అంటార్కిటిక్ ఫ్యాన్-షేప్డ్ బేసిన్ ప్రావిన్స్' అని నామకరణం చేశారు. ఖండం అంతటా అడ్డంగా విస్తరించి ఉన్న ఈ ఆకృతి, ఒక సరికొత్త 'టెక్టోనిక్ ప్రావిన్స్'గా పరిగణించేంత భారీగా ఉండటం విశేషం.

నేరుగా చూడటం అసాధ్యం
ఇంత దట్టమైన మంచు కింద ఉన్న ఈ రహస్య సామ్రాజ్యాన్ని నేరుగా చూడటం అసాధ్యం కావడంతో, సైంటిస్టులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయించారు. అంతరిక్ష గురుత్వాకర్షణ డేటా, అయస్కాంత సర్వేలు, భూకంప ప్రకంపనల రికార్డులు ,మంచు కింద ఉన్న భూభాగ చిత్రాల (Radar imaging) ఆధారంగా ఈ అదృశ్య మైదానం.. పూర్తి మ్యాప్‌ను విజయవంతంగా సృష్టించారు. వందల మిలియన్ల సంవత్సరాల క్రితం భారతదేశం, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ,దక్షిణ అమెరికా ఖండాలు కలిసి 'గోండ్వానా' అనే ఒకే ఉమ్మడి మహాఖండంగా ఉన్న కాలం నాటి చరిత్రను ఈ నిర్మాణం ప్రతిబింబిస్తోందని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు.
అప్పట్లో ఈ 'గోండ్వానా' సూపర్ కాంటినెంట్ విడిపోతున్న క్రమంలో, భూమి పైపొర తీవ్రమైన ఒత్తిడికి లోనై సాగదీయబడినప్పుడు ఏర్పడిన పగుళ్లే ఈ భారీ విసనకర్ర ఆకారపు నిర్మాణానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది ఖండాల కదలికలకు (Continental Drift) ఒక తిరుగులేని చారిత్రక ఆధారంగా నిలవనుంది. అంతేకాకుండా, దశాబ్దాలుగా శాస్త్రవేత్తలకు చిక్కుముడిగా మారిన, అంటార్కిటికా మంచు కింద దాగివున్న 'గాంబర్ట్సేవ్ పర్వతాల' (మంచు గర్భంలోని ఆల్ప్స్ పర్వతాలు) ఆవిర్భావ రహస్యానికి కూడా ఈ ఆవిష్కరణతో ముడిపడి ఉన్నట్లు భావిస్తున్నారు.
ఈ సరికొత్త అన్వేషణ కేవలం భూమి పాత చరిత్రను తెలుసుకోవడానికే కాకుండా, ప్రస్తుత ప్రపంచాన్ని వణికిస్తున్న వాతావరణ మార్పులను అంచనా వేయడానికి కూడా ఎంతో కీలకం కానుంది. మంచు అడుగున ఉండే భూభాగ స్వభావమే అక్కడ గ్లేసియర్లు (మంచు నదులు) ప్రవహించే వేగాన్ని, అవి కదిలే దిశలను శాసిస్తుంది. ఈ తాజా సమాచారం ఆధారంగా భవిష్యత్తులో గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు ఎంత వేగంగా కరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు ఎంత మేర పెరుగుతాయనే విషయాలపై ఖచ్చితమైన ప్రెడిక్టివ్ మోడల్స్ (నమూనాలు) తయారు చేయడానికి వీలవుతుంది. కిలోమీటర్ల మంచు కింద లోయలు, పర్వతాలు, జలాశయాలతో దాగివున్న ఈ సరికొత్త ఊహించని ప్రపంచం రాబోయే రోజుల్లో మరిన్ని మానవ పరిశోధనలకు మైలురాయిగా నిలవనుంది.













Click it and Unblock the Notifications