జగన్ Vs చంద్రబాబు, ఎవరిది పై చేయి - ఇదీ గ్రౌండ్ రియాల్టీ..!!
ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా మారుతోంది. యుద్దానికి పార్టీలు సిద్దం అంటున్నాయి. సీఎం జగన్ అభ్యర్దుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. జగన్ ఇప్పటికే ఎన్నికలకు కేడర్ ను సిద్దం చేసే క్రమంలో రెండు భారీ సభలు నిర్వహించారు. టీడీపీ, జనసేన కూటమిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ వైఖరి పైన మరింత క్లారిటీ రావాల్సి ఉంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్లోనూ స్పష్టత కనిపిస్తోంది.
హోరా హోరీ : ఏపీలో వై నాట్ 175 నినాదంతో జగన్ ముందుకు వెళ్తున్నారు. తాను చేసిన సంక్షేమం రాష్ట్రంలో 83 శాతం మందికి అందిందని చెప్పుకొచ్చారు. ఆ సంక్షేమంతో పాటుగా అమలు చేసిన సామాజిక న్యాయం తన ఎన్నికల అస్త్రాలుగా జగన్ భావిస్తున్నారు. మంచి జరిగితేనే తనకు ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ప్రతిపక్షాలకు ఓటు వేస్తే పథకాల రద్దుకు ఆమోదం చెప్పినట్లేనని నినదిస్తున్నారు. ఇప్పటికే దాదాపు జగన్ తన అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసారు. దాదాపు 75 మంది ఎమ్మెల్యేల స్థానాలు మార్చారు. 17 మంది ఎంపీలను మార్చేసారు. ప్రతిపక్షాలు పొత్తులతో వస్తున్నాయని..తాను సింగిల్ గానే పోటీ చేస్తానని జగన్ స్పష్టం చేస్తున్నారు. భీమిలి, ఏలూరులో సిద్దం సభలను నిర్వహించిన జగన్.. మరో రెండు సభలకు సిద్దమవుతున్నారు.

ఎన్నికలకు సిద్దం : ఇటు, టీడీపీ - జనసేన పరిస్థితి భిన్నంగా ఉంది. చంద్రబాబు రా కదలిరా పేరుతో జిల్లాల్లో సభలు నిర్వహిస్తున్నారు. పవన్ కల్యాణ్ నాలుగు నెలల నుంచి ప్రజల్లోకి రావటం లేదు. రెండు పార్టీల మద్య సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి రాలేదు. పవన్ అభిమానులు సీఎం సీటు షేరింగ్ తో పాటుగా 50 స్థానాలకు తక్కువ కాకుండా తీసుకోవాలని ఒత్తిడి పెంచుతున్నారు. టీడీపీ నుంచి 25 సీట్ల వరకు జనసేనకు కేటాయించే విధంగా ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. రెండు ఎంపీ స్థానాల పైన హామీ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ సీట్ల సర్దుబాటు పైన పవన్ తాజాగా చంద్రబాబుతో సమావేశమయ్యారు. సీట్ల పెంపు పైన చర్చిస్తున్నారు. ఈ నెల మూడో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. సీట్ల కోసం రెండు పార్టీల నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది.

ఏం తేల్చబోతున్నారు : సీట్లు ప్రకటించిన తరువాత క్షేత్ర స్థాయిలో సర్దబాట్లు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఎన్నికల మేనిఫెస్టో విషయంలో జగన్ పథకాలు ఇప్పటికే ప్రజల్లో ఉన్నాయి. టీడీపీ సంక్షేమ పథకాలు ప్రకటించినా పెద్దగా ఆదరణ కనిపించటం లేదు. రెండు పార్టీల మేనిఫెస్టో పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో బీజేపీ పాత్ర ఏంటనేది స్పష్టత రావటం లేదు. బీజేపీ వేరుగా పోటీ చేస్తే ఏపీలో బహుముఖ పోరు ఖయం అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే చంద్రబాబు - పవన్ ఆశలకు షర్మిల, బీజేపీ గండి కొట్టే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. జగన్ దూకుడుగా వెళ్తున్న వేళ చంద్రబాబు, పవన్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications