BRS లోకి కవిత రీఎంట్రీ? రియాక్షన్ ఇదే. 1,400 కోట్ల క్విడ్ ప్రో కో జరిగింది!
తాను సొంతంగా పార్టీ పెట్టుకొని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే, బీఆర్ఎస్ పార్టీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తూ కుట్రలకు తెరలేపుతున్నారని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్ఎస్‌లో చేరే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. నా ప్రజా పోరాటాల వార్తలు ప్రజల్లోకి వెళ్లకుండా కాంగ్రెస్, బీజేపీలతో బీఆర్ఎస్ చేతులు కలిపిందని మండిపడ్డారు. తన పార్టీతో భయం లేదంటూనే ఎన్నికల సంఘానికి (ఈసీ) వెయ్యికి పైగా ఫిర్యాదులు ఇచ్చారని, టీఆర్ఎస్ అనే పేరు తనకు రాకుండా చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తల్లి, చెల్లి అనే సభ్యత, ఇంగితం మరిచి బీఆర్ఎస్ హౌలా గాళ్లతో ఇష్టానుసారం కామెంట్లు చేయిస్తున్నారని, ఇలాంటి బూతులు తిడితే ఊరుకునేందుకు ఇది ఆంధ్రా కాదని, కాళ్లు విరగొట్టి చేతుల్లో పెడతామని ఆమె హెచ్చరించారు.
బీఆర్ఎస్ పార్టీకి ఒక నీతి, నియమం అంటూ ఏమీ లేవని, పార్టీని జోడెద్దుల మాదిరిగా నడపాల్సిన వాళ్లే అంబోతుల్లాగా సిగ్గు లేని వ్యవహారాలు చేస్తున్నారని కవిత విమర్శించారు. కేటీఆర్ తన మిత్రుడు ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కు క్విడ్ ప్రో కో ద్వారా అక్రమ పర్మిషన్లు ఇచ్చారని, అలాగే రూ.188 కోట్లు పెట్టి పయోనీర్ అనే ఇంగ్లీష్ పేపర్‌ను కొనుగోలు చేశారని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిలో అతిపెద్ద అనకొండ, గుంటనక్క అయిన హరీశ్ రావునే బీఆర్ఎస్ ఇంకా ముందు పెట్టి మాట్లాడుతోందని, పాలమూరు ప్రాజెక్టుకు కూడా ఆయనే అన్యాయం చేశారని దుయ్యబట్టారు.

చేసిన అవినీతి, పెద్దాయనకు అంటించిన అవినీతి మరకలు చాలవన్నట్లుగా హరీశ్ రావుకు ఇంకా మూడు నెలలు మంత్రి పదవి కావాలా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్న రూ.1,400 కోట్ల రూపాయలు క్విడ్ ప్రో కో ద్వారా వచ్చినవేనని, ఆ డబ్బును అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పంచాలని ఆమె డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లోకి చైతన్య, నారాయణ లాంటి స్కూళ్లను రానివ్వకుండా తాను ఫైట్ చేస్తే, ఇవ్వాళ హరీశ్ రావు మాత్రం ఆ సంస్థలకు పాలు అమ్ముకుంటున్నాడని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు..
అవినీతి విషయంలో బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తలుపులు తెరిచిందని కవిత ఎద్దేవా చేశారు. ఫినిక్స్ సంస్థకు రూ.80 వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టారని, ఆ సంస్థ వాడు 33 లక్షల టన్నుల కలప కొట్టేస్తున్నా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కేసులు పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాన్ని డైవర్ట్ చేసేందుకే కాళేశ్వరం అంశాన్ని తెరపైకి తెచ్చిందని, ఈ ముఖ్యమంత్రికి నీటిపై కనీస అవగాహన లేదని విమర్శించారు.
మేడిగడ్డతో సంబంధం లేకుండా అర కిలోమీటర్ రాళ్ల కట్ట కడితే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా నీళ్లు ఎత్తిపోసుకోవచ్చని, కానీ బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఎత్తిపోయకుండా రైతులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఏడు రకాలకే అంటూ బోగస్ మాటలు చెప్తున్నారన్నారు. సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ధర్నా చేసిన 10 వేల మంది మహిళల్లో 90 మంది రైతులపై అక్రమ కేసులు, 9 మందిపై రౌడీ షీట్లు పెట్టారని, ఖమ్మంలో రైతు సభ జరిగే లోపు ఆ రౌడీ షీట్లను, కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
సింగరేణి సమస్యలు.. మైనింగ్ వివాదాలు.
తాడిచర్ల-2 మైనింగ్ కేటాయించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నాడని, నిజాం రాసిచ్చిన 17 గనుల్లో కేంద్రం లాక్కున్న మిగతా 16 గనులను కూడా బేషరతుగా సింగరేణికి ఇచ్చేయాలని కవిత డిమాండ్ చేశారు. తాడిచర్ల-2 మైనింగ్‌ను సింగరేణియే ఆపరేట్ చేయాలని, ప్రైవేట్ సంస్థలకు ఇస్తే స్థానికులకు ఉద్యోగాలు రావన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తాడిచర్ల-1 మైనింగ్‌ను దొడ్డిదారిన ప్రైవేట్ వాళ్లకు ఇచ్చి కార్మికులకు అన్యాయం చేసిందని, ప్రస్తుత సీఎం బావమరిదికి సత్తుపల్లి మైన్‌లో ఇస్తే అక్కడ కూడా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆరోపించారు.
సింగరేణి కార్మికుల సంఖ్య 62 వేల నుండి 38 వేలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డిపెండెంట్ ఉద్యోగాల కోసం తాము ఎంతో కృషి చేస్తే ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్లకే ఆన్-ఫిట్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టి పెండింగ్ డిపెండెంట్ ఉద్యోగాలు, అలియాస్ పేర్ల సమస్యను తీర్చకపోతే ప్రజాస్వామ్యయుతంగా నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎర్రజెండా వేసుకొని కాంగ్రెస్‌తో అలయ్ బలయ్ చేసుకుంటూ సొంత అజెండాతో పనిచేస్తున్నారని, మెడికల్ బోర్డు, కార్మికుల సొంతింటి కల, కేంద్రం తెచ్చిన లేబర్ చట్టాలపై ఆయన మాట్లాడటం లేదని, కేంద్ర చట్టాలను అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయిస్తేనే ఆయన చిత్తశుద్ధిని నమ్ముతామని స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications