నిర్ణయం నీదే, బాలినేనితో తేల్చేసిన సీఎం జగన్ - మరో జాబితా సిద్దం..!!
వైసీపీలో సంచలనంగా మారిన బాలినేని వ్యవహారం ఒక కొలిక్కొచ్చింది. వైసీపీ ఇంచార్జ్ ల మార్పు వ్యవహారంలో బాలినేని అలక బూనారు. ఒంగోలు ఎంపీ సీటు మాగుంటకు ఇవ్వాలని పట్టుబట్టారు. తాజాగా నేరుగా సీఎం జగన్ తో సమావేశమయ్యారు. తన నిర్ణయం ఏంటో జగన్ తేల్చి చెప్పారు. బాలినేని సీటు పైనా క్లారిటీ ఇచ్చారు. సీఎం మూడ్ అర్దమైన బాలినేని రాజీ పడ్డారు. ఇక, పార్టీలో ఇంచార్జ్ ల మార్పులో భాగంగా నాలుగో జాబితా ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది.
సీఎంతో బాలినేని బేటీ: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని సీఎం జగన్ పిలిపించి మాట్లాడారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలనుకుంటుందీ అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు నుంచా, గిద్దలూరు నుంచా అని ప్రశ్నించారు. ఆ సందర్భం లో బాలినేని మరోసారి మాగుంటకు ఎంపీ సీటు గురించి ప్రస్తావించే ప్రయత్నం చేసారు.

మాగుంట సీటు విషయం గురించి ప్రస్తావన వద్దని సీఎం తేల్చి చెప్పినట్లు సమాచారం. ఒంగోలు లోక్‌సభ స్థానాన్ని మాగుంటకే ఇవ్వాలని బాలినేని పట్టుబడుతున్నారు. ఆయనకు సీటిస్తేనే తాను ఒంగోలు అసెంబ్లీ బరిలో నిలుస్తానని ఇంతకాలం చెబుతూ వచ్చారు. ఒంగోలులో ఇళ్ల పట్టాల సంగతి తేలిస్తేనే పోటీ చేస్తానని జగన్‌కు చెప్పారు.
మాగుంటకు నో ఛాన్స్: ఇళ్ల పట్టాలకు ఎంత ఖర్చవుతుందో అధికారులతో మాట్లాడి తేలుస్తానని, ఖర్చు భరించగలమో లేదో చెబుతానని జగన్ అన్నారు. ఆ నిర్ణయాన్ని బట్టి తాను ఒంగోలు నుంచి పోటీ చేయాలో.. గిద్దలూరుకు వెళ్లాలో నిర్ణయించుకుంటానని బాలినేని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో, బాలినేని వచ్చే ఎన్నికల్లో ఒంగోలు లేదా గిద్దలూరు నుంచి పోటీ చేయటం ఖాయమైంది. ఆయన కుమారుడుకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది.
బాలినేని సీటు ఖరారు చేస్తే ఒంగోలు ఎంపీ స్థానంలో పాటుగా ప్రకాశం జిల్లాలో మార్పుల పైన సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. మాగుంట కోసం ఇప్పటి వరకు పట్టు బట్టిన బాలినేని రాజీ పడ్డారు. దీంతో, వైసీపీలో సీటు రాదని డిసైడ్ కావటంతో మాగుంట టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
నాలుగో జాబితా సిద్దం: మరోవైపు వైసీపీ నాలుగో జాబితా ఈ రోజు లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు విడతల్లో 50 మంది అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించారు. నాలుగో జాబితాలో ఎంపీ అభ్యర్దులే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నర్సరావు పేట ఎంపీ లావు శ్రీక్రిష్ణ దేవరాయులను గుంటూరు నుంచి బరిలోకి దింపాలనేది సీఎం ఆలోచన. నర్సరావుపేట ఎంపీ పరిధిలో ఏ నియోజకవర్గంలోనూ బీసీ అభ్యర్ది లేరు.
దీంతో, అక్కడ ఎంపీగా బీసీ వర్గానికి కేటాయించి, క్రిష్ణదేవరాయులను గుంటూరు మార్చాలని భావిస్తున్నారు. దీని పైన పల్నాడు ఎమ్మెల్యేలు సీఎంతో చర్చించారు. నర్సరావుపేటతో పాటుగా గుంటూరు, మచిలీపట్నం, రాజమండ్రి, కాకినాడ, బాపట్ల, కడప, రాజంపేట, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్దులను జగన్ ఈ జాబితాలో ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications