హోం మంత్రి అమిత్ షా తో సీఎం జగన్ భేటీ : టీడీపీతో పొత్తు - క్లారిటీ..!?
ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ప్రధాని తో సీఎం జగన్ 45 నిమిషాల పాటు సమావేశమయ్యారు. పాలనా పరమైన అంశాలతో పాటుగా రాజకీయ వ్యవహారాలపైన సీఎం చర్చించారు. ఏపీలో ముందస్తుగానే ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్ కేంద్రంతో సత్సంబంధాలు కోరుకుంటున్నారు. రాజకీయం బంధాలు ఎలా ఉన్నా.. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన ప్రయోజనాల ను దక్కించుకొనే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ తోనూ సీఎం జగన్ భేటీ ఖరారైంది. రాత్రి 10 గంటలకు అమిత్ షా తో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఇందులో ఏపీతో పాటుగా తెలంగాణ రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..ఢిల్లీ పర్యటనలో
ఏపీలో సీఎం జగన్ వచ్చే ఎన్నికలకు ముందుగా సిద్దమవుతున్నారు. పార్టీ శ్రేణులను సిద్దం చేస్తున్నారు. కేంద్రానికి అన్ని అంశాల్లోనూ వైసీపీ సహకరిస్తోంది. ఇక, ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాలనా పరంగా పెండింగ్ లో ఉన్న అంశాలను పరిష్కరించాలని సీఎం జగన్ కోరుతున్నారు. అందులో భాగంగా కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సవరించిన అంచనాల ఆమోదం కోసం ప్రధాని నుంచి స్పష్టమైన హామీ కోరాలని జగన్ ప్రయత్నించారని తెలుస్తోంది. ఇక, తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ అంశాల పైన చర్చకు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు తాజాగా తెలంగాణ రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వటం.. బీజేపీతో మైత్రి కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తల నడుమ బీజేపీ మనోగతం ఏంటనేది సీఎం జగన్ కు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నార.

అమిత్ షా తో రాజకీయాలే ప్రధాన అజెండాగా..
ఇక, ప్రధానితో భేటీ తరువాత రాత్రికి అమిత్ షా తో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ భేటీలో పూర్తిగా రాజకీయ అంశాలే చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన బీజేపీ అక్కడ కొన్ని చిన్న పార్టీలతో పొత్తు దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక, ఏపీలో జనసేనతో పొత్తు కొనసాగిస్తున్న బీజేపీ భవిష్యత్ కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు టీడీపీ తెలంగాణలో బీజేపీకి సహకారం అందిస్తామని.. ఏపీలో 2014 పొత్తులు రిపీట్ చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఈ సమయంలో బీజేపీ అధినాయకత్వం టీడీపీతో తిరిగి పొత్తుకు సిద్దంగా ఉందా లేదా అనేది అంతు చిక్కని విషయంగా మారుతోంది. బీజేపీ నేతలు తమకు జనసేనతో మినహా ఎవరితోనూ పొత్తు లేదని చెబుతున్నారు. అటు ప్రధాని - ఇటు అమిత్ షా తో సీఎం జగన్ భేటీ వేళ..దీని పైన బీజేపీ నేతలు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

టీడీపీ - జనసేన పొత్తు పై వైసీపీ అంచనా..
ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ -జనసేన పొత్తు ఖాయమనే అంచనాతో వైసీపీ నేతలు ఉన్నారు. దీనికి అనుగుణంగానే ఇప్పటికే చంద్రబాబు - పవన్ కల్యాణ్ ను కలిపి వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. సీఎం జగన్ సైతం తన సభల్లో చంద్రబాబు - దత్తపుత్రుడు అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే, బీజేపీ వారితో కలుస్తుందా లేదా అనేదే క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రధాని మోదీతో తమ బంధం రాజకీయాలకు అతీతమని విశాఖలో బహిరంగ సభ వేదికగా సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అమిత్ షాతో భేటీ వేళ ఏపీ రాజకీయాల్లో తమ వైఖరి పైన అమిత్ షా సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు పొత్తుల దిశగా చేస్తున్న ప్రయత్నాలతో బీజేపీ నేతలు ముందుకు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు. సీఎం జగన్ తాము ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని ఇప్పటికే స్పష్టం చేసారు. ఇక, సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తరువాత రాజకీయంగా కీలక నిర్ణయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications