హోం మంత్రి అమిత్ షా తో సీఎం జగన్ భేటీ - టార్గెట్ 2024..!!
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న ముఖ్యమంత్రి ఏపీలో కేంద్రం నుంచి దక్కించుకోవాల్సిన అంశాల పైన ఫోకస్ చేసారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీలు పొత్తులతో సీఎం జగన్ లక్ష్యంగా రాజకీయంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇదే సమయంలో సీఎం జగన్ ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజకీయ ప్రారంభించారు. మూడు రోజులు ఢిల్లీలోనే మకాం వేసారు. ఈ రోజు రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సీఎం జగన్ భేటీ కానున్నారు.
ఢిల్లీలో సీఎం జగన్ : ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో జరిగిన నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీ చేరిన వెంటనే కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. 2014 - 15 రెవిన్యూ లోటు కింద రూ 10 వేల కోట్లకు పైగా నిధులను కేంద్రం విడుదల చేయటం పైన ధన్యవాదాలు చెప్పారు. అదే విధంగా కేంద్రం నుంచి రావాల్సిన ఇతర నిధుల గురించి చర్చించారు. ఏపీకి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీ ఆర్దిక స్థితితో పాటుగా కేంద్రం నుంచి కోరుకుంటున్న సాయం గురించి వివరించారు. నీతి అయోగ్ సమావేశం తరువాత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం నిధులు సహా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని సీఎం కోరారు.

ప్రధాని తో కలిసి పార్లమెంట్ లో : ఇదే సమయంలో ఇప్పుడు జాతీయ స్థాయిలో సీఎం జగన్ చేసిన ట్వీట్ పైన చర్చ సాగుతోంది. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించి జాతీయ స్థాయిలో విపక్షాలు బహిష్కరించాలని నిర్ణయించాయి. ఈ సమయంలో ప్రధానిని అభినందించిన ముఖ్యమంత్రి జగన్..అన్ని పక్షాలు ఇటువంటి కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. దీని పైన భిన్న స్పందనలు వచ్చాయి. పార్లమెంట్ భవన ప్రారంభ సమయంలో జగన్ హాజరయ్యారు. కేంద్ర మంత్రులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలని భావిస్తున్న వేళ..ఢిల్లీ కేంద్రం జగన్ కు కేంద్రంలోని ముఖ్యులు ఇస్తున్న ప్రాధాన్యత..పొత్తు రాజకీయాల్లో స్పష్టమైన సంకేతాలుగా భావిస్తున్నారు.
అమిత్ షా తో భేటీలో : ఈ రోజు రాత్రి 9 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సీఎం జగన్ భేటీ కానున్నారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తవుతోంది. రాష్ట్ర విభజన అంశాల్లో కేంద్ర హోం శాఖ నోడల్ వ్యవస్థగా వ్యవహరిస్తోంది. ఈ భేటీలో పాలనా పరమైన వ్యవహారాలతో పాటుగా రాజకీయ అంశాల పైన చర్చించనున్నారు. ఈ భేటీలో ఏపీలో తాజా రాజకీయ పైన చర్చ జరిగే అవకాశం ఉంది. కేంద్రంలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజ్యసభలో వైసీపీ మద్దతు బీజేపీకి కీలకంగా మారనుంది. ఇదే సమయంలో ఎన్నికల ఏడాదిలో కేంద్రం నుంచి మద్దతు సీఎం జగన్ కు అవసరం కానుంది. ఈ సమయంలో పొత్తుల ప్రతిపాదనలు వచ్చాయి.ఈ మొత్తం సమీకరణాల పైన ఈ రోజు అమిత్ షా తో సీఎం జగన్ భేటీ సమయంలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications