మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ - రేపే ఖాతాల్లోకి నిధుల విడుదల..!!
ఏపీలోని డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్సార్ ఆసరా పథకంమూడో విడత నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. రేపు (శనివారం) ఏలూరు జిల్లా దెందులూరు వేదికగా ముఖ్యమంత్రి జగన్ ఈ నిధులను మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ఈ నిధులను విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 5 వరకు అన్ని నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ నగదు పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. ఇదే సమయంలో రాజకీయంగానూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ..సీఎం జగన్ ప్రసంగం పైన ఆసక్తి నెలకొంది.
2019 ఎన్నికల వేళ జగన్ కీలక హామీ ఇచ్చారు. అప్పటి వరకు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు చెల్లించాల్సిన బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,571 కోట్ల అప్పు ఉంది. అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగు విడతలుగా అప్పటి వరకు బ్యాంకుల్లో బకాయి ఉన్న ఈ మొత్తం చెల్లింపు పైన స్పష్టత ఇచ్చారు.

అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పిన విధంగా చెల్లింపు ప్రారంభించారు. ఇప్పటికే రెండు విడతలుగా చెల్లింపు జరిగింది. రేపు మూడో విడత నిధుల విడుదలకు నిర్ణయంచారు. రాష్ట్రవ్యాప్తంగా 78.94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్ జమ చేయనున్నారు.
ఈ డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు ఏ అవసరానికైనా వాడుకోవచ్చని సీఎం జగన్ ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. సీఎం జగన్ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 10.30 గంటలకు దెందులూరు చేరుకుంటారు. 10.50 - 12.35 బహిరంగ సభలో వైయస్ఆర్ ఆసరా ఆర్ధిక సాయాన్ని సీఎం జగన్ విడుదల చేయనున్నారు.

ఇదే వేదిక నుంచి రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అనూహ్య రాజకీయ పరిణామాల పైన ముఖ్యమంత్రి స్పందించే అవకాశం కనిపిస్తోంది. అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు దెందులూరు నుంచి బయలుదేరి 1.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటన కోసం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications