సీఎం జగన్ కీలక అడుగులు - అమరావతి కేంద్రంగా, వాట్ నెక్స్ట్..!!
ముఖ్యమంత్రి జగన్ అమరావతి పర్యటనపై ఆసక్తి పెరుగుతోంది. మూడు రాజధానుల ప్రకటన తరువాత సీఎం జగన్ తొలి సారి అమరావతిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నారు. అమరావతిలో పేదలకు ఇంటి స్థలాల పంపిణీ ద్వారా ప్రతిపక్షాలకు సీఎం జగన్ చెక్ పెట్టారు. ప్రతిపక్షాలు అమరావతికి మద్దతుగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఎన్నికల వేళ సీఎం జగన్ అమరావతిలో వేస్తున్న అడుగులు కొత్త సమీకరణాలకు కారణమవుతోంది. అమరావతి కేంద్రంగా కొత్త రాజకీయం మొదలైంది.
సీఎం జగన్ మరో కీలక అడుగు:అమరావతిలో ముఖ్యమంత్రి జగన్ మరో కీలక అడుగు వేయనున్నారు. కొంత కాలంగా పేదలకు అమరావతిలో ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి న్యాయ పరమైన సమస్యలకు పరిష్కారం రావటంతో ఇప్పుడు అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన సుమారు 50వేల మందికి అమరావతి రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. దీనికోసం ఈనెల 26న వెంకటపాలెంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మూడు రాజధానుల ప్రకటన తరువాత అమరావతి కేంద్రంగా సీఎం జగన్ తొలి సారి బహిరంగ సభలో పాల్గొంటున్నారు. సీఎం ప్రసంగం పైన రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది.

ఇళ్ల స్థలాల పంపిణీ:ఆర్ 5, ఎస్3 జోన్‌లలో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని పైన స్థానిక రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు ఈ వ్యవహారం పైన స్పష్టత ఇచ్చింది. తుది తీర్పు కు లోబడి పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేయవచ్చంటూ స్పష్టం చేసింది. ఇప్పుడు అమరావతిలో ఇంటి స్థలాల పంపిణీకి ఈ నెల 26న ముహూర్తంగా నిర్ణయించారు. అమరావతికి సీఎం జగన్ వ్యతిరేకం అంటూ ప్రతిపక్షాలు కొంత కాలంగా ప్రచారం చేస్తున్నాయి. విశాఖ కేంద్రంగా పాలనకు సీఎం జగన్ సిద్దం అవుతున్నారు. ఈ సమయంలో రాజకీయంగా ముఖ్యమంత్రి జగన్ అమరావతి పర్యటన కీలకంగా మారుతోంది. ఈ సభలో ముఖ్యమంత్రి జగన్ అమరావతి పైన తన ఆలోచనలను స్పష్టం చేయనున్నారు.
ఏం ప్రకటించబోతున్నారు:అమరావతిలో ఇంటి స్థలాలతో పాటుగా టిడ్కో గృహాలను పంపిణీ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. అమరావతిలో లే అవుట్ అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ రాజధాని అమరావతి ప్రాంతంలో రాజకీయంగా పట్టు పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతి ప్రాంతంలో వైసీపీకి రాజకీయంగా నష్టం తప్పదనే అంచనాలతో ఉన్నాయి. ఇప్పుడు అదే ప్రాంతంలో రెండు జిల్లాల పరిధిలోని పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ ద్వారా సీఎం జగన్ కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. దీనిని ప్రతిపక్షాలు వ్యతిరేకించలేని పరిస్థితి. ఇదే సమయంలో రానున్న రోజుల్లో అమరావతి కేంద్రంగా సీఎం మరిన్ని నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం.












Click it and Unblock the Notifications