విశాఖకు ఇద్దరు ముఖ్యమంత్రులు జగన్ - కేసీఆర్..!?
ఇప్పుడు విశాఖ కేంద్రంగా రాజకీయాలు వేగం పెరుగుతోంది. ఈ నెల 28న ఏపీ ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన ఖరారైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విశాఖ రానున్నట్లు సమాచారం. ఖమ్మంలో బీఆర్ఎస్ సభ తరువాత విశాఖలో రెండో సభ ఉంటుందని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రకటించారు. ఈ పర్యటనలో కేసీఆర్ రాజకీయ సభలో పాల్గొంటారా లేక నిర్ణయించిన కార్యక్రమాలకే పరిమితం అవుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ఇద్దరు సీఎంలు వేర్వేరుగా ఒకే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 28న విశాఖ వెళ్లనున్నారు. విశాఖ శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు జరగనున్నాయి. జనవరి 27 నుంచి 31వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి తాడేపల్లికి వచ్చి సీఎం జగన్ ను ఆహ్వానించారు. దీంతో..ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 28న శారదా పీఠంలో జరిగే రాజశ్యామల యాగంలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొంటారని సమాచారం. గతంలోనూ పీఠం లో జరిగిన యాగంలో జగన్ పాల్గొన్నారు. ఈ యాగం చేసిన వారికి విజయం ఖాయమనే నమ్మకం ఉంది. విశాఖలో వచ్చే ఉగాది నుంచి పాలన ప్రారంభించేందుకు సీఎం జగన్ సిద్దం అవుతున్నారు. అదే విధంగా మార్చిలో రెండు అంతర్జాతీయ ఈవెంట్స్ విశాఖ కేంద్రంగా జరగనున్నాయి. ఈ రెండు ఈవెంట్స్ లోనూ సీఎం పాల్గొంటారు.

ఇక..శారదా పీఠంలో జరిగే ఉత్సవాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ ఏపీ నేతలు చెబుతున్నారు. 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో ఒక రోజున సీఎం కేసీఆర్ వచ్చి ప్రత్యక్షంగా పూజల్లో పాల్గొంటారని సమాచారం. విశాఖ కేంద్రంగానే బీఆర్ఎస్ రెండో సభనిర్వహించనున్నట్లు ఇప్పటికే ఏపీ నేతలు వెల్లడించారు. కానీ, సభ ఎప్పుడు నిర్వహించాలనేది ఇంకా స్పష్టత రాలేదు. కేసీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా రాజ శ్యామల యాగం చేయిస్తూ ఉంటారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభ సమయంలోనూ ఈ యాగం నిర్వహించారు. గతంలోనూ విశాఖ శారదా పీఠం సందర్శించిన సీఎం కేసీఆర్ అక్కద స్వామి స్వరూపానంద ఆశీర్వాదం తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి కేసీఆర్ విశాఖ రానున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications