ఢిల్లీకి సీఎం జగన్, మారుతున్న లెక్కలు - పొత్తుల వేళ కొత్త సమీకరణాలు..!!
ఎన్నికల వేళ ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం జగన్ పార్టీ, పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల దిశగా పలు నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీలో పొత్తుల రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటోంది. ఈ సమయంలో జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.
జగన్ కీలక అడుగులు:ముఖ్యమంత్రి జగన్ రానున్న ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ అభ్యర్దుల ఖరారు పై జగన్ చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇటు పాలనా పరంగా ఎన్నికల వేళ కొత్త వరాల ప్రకటన పైన జగన్ అడుగులు వేస్తున్నారు. ఇటు ప్రతిపక్షాల ఆలోచనలు, వ్యూహాలకు ధీటుగా తన కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. అభ్యర్దులతో పాటుగా ఉమ్మడి మేనిఫెస్టో పైన చర్చలు చేస్తున్నాయి. మరో వైపు బీజేపీ తమతో కలిసి రావాలని చంద్రబాబు, పవన్ కోరుతున్నారు. బీజేపీ తమ నిర్ణయం పైన ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ సమయంలోనే సీఎం జగన్ ఢిల్లీ పర్యటకు వెళ్లనున్నారు.

ఢిల్లీ పర్యటన:సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనలో హోం మంత్రి అమిత్ షా తో పాటుగా ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలతో పాటుగా పోలవరం కు సవరించిన అంచనాల ఆమోదం పైనా కేంద్రంతో చర్చించనున్నారు. ఇప్పటికే సవరించిన అంచనాలకు కేంద్రం అంగీకారం తెలిపినా నిధులు విడుదలలో జాప్యం జరుగుతోంది. ఎన్నికల వేళ వీటితో పాటుగా నిధుల సమీకరణ దిశగా సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విభజన చట్టం ప్రకారం షెడ్యూల్ 9,10 లోని సంస్థల విభజన పైనా కేంద్రం వద్ద మరోసారి చర్చ చేయనున్నట్లు సమాచారం.
పొత్తు రాజకీయం:ఇక, రాజకీయంగానూ ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ ఏపీలో తమకు జనసేనతో పొత్తు కొనసాగుతుందని చెబుతూనే ఎక్కడా టీడీపీ ప్రస్తావన చేయటం లేదు. బీజేపీ కోసం కొద్ది రోజుల వరకు వేచి చూసి తమ రెండు పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్దులు, మేనిఫెస్టో ప్రకటన దిశగా చంద్రబాబు, పవన్ అడుగులు వేస్తున్నారు. బీజేపీ కలిసి రాకపోతే సీపీఐను కలుపుకొనే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ ఏపీలో టీడీపీ, జనసేన కూటమిలో చేరుతుందా లేదా అనే చర్చ సాగుతున్న వేళ..బీజేపీ ముఖ్యులు ఏపీలో అమలు చేస్తున్న రాజకీయం ఆసక్తిని పెంచుతోంది. పొత్తు పైన పెంచుతున్న ఒత్తిడి, వేస్తున్న అడుగుల పైన టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications