సీఎం జగన్ ముఖ్య కార్యదర్శి బదిలీ - ఢిల్లీకి ప్రవీణ్ ప్రకాశ్ : ప్రక్షాళన మొదలైందా..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ముఖ్య కార్యదర్శి బదిలీ అయ్యారు. ఏపీ సీఎంఓ లో ముఖ్య కార్యదర్శి హోదాలో వ్యవహరిస్తున్ సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయనను ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా నియమించారు. ప్రస్తుత రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనాను రెసిడెంట్ కమిషనర్ గా రిలీవ్ చేస్తూ అదేశాలిచ్చారు. భావనా సక్సేనా ఐపీఎస్ అధికారి.. ప్రవీణ్ ప్రకాశ్ సతీమణి. ఇప్పుడు భావన సక్సేనా కేంద్ర సర్వీసుల్లో భాగంగా విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు.

ఢిల్లీలో ప్రవీణ్ ప్రకాశ్ కు బాధ్యతలు
ఇక, ప్రవీణ్ ప్రకాశ్ టీడీపీ హయాంలో ఢిల్లీలోనే ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా పని చేసారు. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ఏపీ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్ తో 1
పీకి వచ్చారు. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే ఆయనకు సీఎంఓలో అవకాశం దక్కింది. సీఎం ముఖ్య కార్యదర్శిగా ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. అదే సమయంలో ఆయన వ్యవహార శైలి పైన కొన్ని ఆరోపణలు సైతం వచ్చాయి. కొంత కాలంగా ప్రవీణ్ ప్రకాశ్ ను సీఎంఓ నుంచి బదిలీ చేస్తారనే ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలోనే సీఎంఓలో ఆయన పర్యవేక్షణలో ఉన్న కీలకమైన రెవిన్యూ శాఖ తో పాటుగా మరో కార్యదర్శిగా ఉన్న సాల్మన్ ఆరోక్య రాజ్ పర్యవేక్షించే ఏపీఎస్ఆర్టీసీ..రోడ్లు - భవనాల శాఖల బాథ్యలతను సీఎం అదనపు కార్యదర్శి ముత్యాల రాజుకు అప్పగించారు.

సీఎంఓలో ముగ్గురు కీలక అధికారులతో
అయితే, పాలనా పరంగా పూర్తి ప్రక్షాళన దిశగా సీఎం జగన్ చర్యలు చేపట్టారనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. అందులో భాగంగా.. త్వరలోనే జిల్లా కలెక్టర్ల బదిలీలు సైతం ఉంటాయని చెబుతున్నారు. ఇక, కొత్త జిల్లాల ఏర్పాటు సమయానికి అనుభవం ఉన్న వారిని కొత్త జిల్లాలకు కలెక్టర్లుగా నియమించాలని భావిస్తున్నారు. జిల్లాల్లో ప్రస్తుతం సచివాలయల బాధ్యతల కోసం నియమించిన మూడో జాయింట్ కలెక్టర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రవీణ్ ప్రకాశ్ బదిలీతో ఇక సీఎంఓలో ధనుంజయ రెడ్డి.. ఆరోక్య రాజ్.. ముత్యాల రాజు కీలకంగా వ్యవహరించనున్నారు.

ప్రవీణ్ సతీమణికి విదేశాంగ శాఖలో పోస్టింగ్
సీఎంఓలోకి తీసుకుంటారంటూ ఇద్దరు సీనియర్ అధికారుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, దీని పైన అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో పలువురు అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఆయన సేవలను ఢిల్లీలో వినియోగించుకోవాలని సీఎం సైతం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రవీణ్ ప్రకాశ్ ఫ్యామిలీ ఢిల్లీలోనే ఉండటంతో ప్రతీ వారం ఢిల్లీ - అమరావతి మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. అయితే, ప్రవీణ్ ప్రకాశ్ బదిలీతో ఇక.. ఏపీలో అధికార వర్గాల్లో ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications