కేంద్రమంత్రులతో కేసీఆర్ భేటీ: బయ్యారం ఉక్కు పరిశ్రమపై టాస్క్‌ఫోర్స్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు శుక్రవారం కేంద్రమంత్రలను కలుస్తూ బిజీబిజీగా గడిపారు. కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌తో ఉద్యోగభవన్‌లో సమావేశమైన ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు ఖర్మాగారం ఏర్పాటు అంశంపై సీఎం కేంద్రమంత్రితో చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. బయ్యారం ఉక్కు పరిశ్రమపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో టాస్క్‌ఫోర్స్ కమిటీ వేస్తామన్నారు. రెండు నెలల్లో దీనిపై పూర్తి అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమకు ప్రభుత్వం తరపున రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ చెప్పారు.

కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రాణహిత-చేవెళ్ళ, దేవాదుల, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తదితర ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై చర్చించారు.
రాష్ర్టానికి రావాల్సిన కాంపా ఫండ్స్ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన హరితహారం ప్రాజెక్టు గురించి కూడా జవదేకర్‌కు సీఎం వివరించారు.
ఐదు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్ కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ వెంట కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, టీఆర్‌ఎస్ ఎంపీలు పాల్గొన్నారు.
శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల ప్రధాన కమిషనర్ హెచ్‌ఎస్ బ్రహ్మతో నిర్వాచన్ సదన్‌లో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఏపీ విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచడంపై చర్చించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications