సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి
రైతులు, ఎరువుల నిల్వలో విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని.. సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారంతో ప్రజల్లో ఆందోళనలను లేవదీయడానికి ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఎరువుల రవాణాను సైతం అడ్డుకుంటోన్నట్లు సమాచారం ఉందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నాయకుల దుష్ప్రచారంలో రైతులు చిక్కుకోవద్దని విజ్ఞప్తి చేశారు. వారి రాజకీయ ఉచ్చులో పడొద్దని కోరారు. సమృద్ధిగా ఎరువుల నిల్వలు ఉన్నాయని ఆక్ష్న తెలిపారు.
ఎరువుల లభ్యతపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లాల వారీగా ఎరువుల సరఫరా లెక్కలను వివరించారు. ఏ జిల్లాలో కూడా కొరత లేదని, చాలినన్ని నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. మరిన్ని ఎరువులు రానున్నాయని తెలిపారు. వైఎస్సార్సీపీ ఎరువుల అంశాన్ని రాజకీయం చేస్తోందిన విమర్శించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వైసీపీ ఎరువుల విషయంలోనూ అదే తరహా దుష్ప్రచారం చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. విషవృక్షం లాంటి ఆ పార్టీ చేసే దుష్ప్రచారాల్లో భాగంగా మరో ఫేక్ స్టోరీలను అల్లుతోందని, వాటిని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. యూరియా, ఎరువుల కొరత ఉందనే ప్రచారంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీని ఓ ఫేక్ పార్టీగా అభివర్ణించారు చంద్రబాబు. నేరాలను నమ్ముకున్న పార్టీ అంటూ ధ్వజమెత్తారు.
ఎరువుల డిమాండ్ ఉన్న జిల్లాలకు మార్క్ ఫెడ్ ద్వారా తరలించి రైతులకు సరఫరా చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో గట్టి నిఘా పెట్టి ఎరువులు పక్కదారి పట్టకుండా చూస్తామని పేర్కొన్నారు. వీటన్నింటిపైనా డ్రామాలు అడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, వారిని జైలుకు పంపుతామని హెచ్చరించారు.
తప్పుడు పోస్టులు చేసి ఆందోళనలను రేకెత్తించి, రాజకీయంగా ప్రయోజనం పొందాలని చూసే వాళ్ల తాట తీస్తామని చంద్రబాబు తెలిపారు. రాజకీయ ప్రయోజనాలతో అలజడులు సృష్టిస్తే జైలుకు పంపుతామని, మొన్నటి వరకు మహిళలపై, నిన్న రాజధానిపై, ఇప్పుడు రైతులను తప్పుదోవ పట్టించేలా చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వాటిని నియంత్రిస్తామని చంద్రబాబు తెలిపారు.
సెప్టెంబర్ 3 నాటికి రాష్ట్రంలో 94,892 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అదనంగా 53,000 మెట్రిక్ టన్నులు కేటాయించిందని, ఇది 10 రోజుల్లోగా చేరుతుందని ఆయన అన్నారు. రబీ సీజన్ కోసం 9,38,000 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించబడిందని ఆయన వెల్లడించారు. అయినప్పటికీ, వైఎస్సార్‌సీపీ రాజకీయ లబ్ధి కోసం ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.
రైతులు రాజకీయాల్లోకి జోక్యం చేసుకోకుండా, రైతులుగానే వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. నెల్లూరు, తిరుపతి, పల్నాడు వంటి కొన్ని జిల్లాల్లో రెండు పంటలు పండించడం వల్ల ఎరువులకు డిమాండ్ పెరిగిందని ఆయన గుర్తించారు. కొన్ని జిల్లాల్లో యూరియా దారి మళ్లించినట్లు గుర్తించి, 1,284 మెట్రిక్ టన్నులను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఎరువుల సరఫరాను క్రమబద్ధీకరించడానికి ఈ-పంట వేదిక నుండి రియల్ టైమ్ డేటా ఉపయోగించుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (VSP) ప్రైవేటీకరణ ఆరోపణలను చంద్రబాబు తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి 12,000 కోట్ల రూపాయల పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రైవేటీకరణ పరిణామాలను పరిశీలించిన తర్వాత కేంద్రం ఇంత పెద్ద నిర్ణయాన్ని మార్చుకోవడం ఇదే మొదటిసారని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ లో కొన్ని సేవలను సామర్థ్యం కోసం ఔట్‌సోర్స్ చేయవచ్చని, కానీ అది ప్రైవేట్ కంపెనీలకు అప్పగించినట్లు కాదని చెప్పారు.












Click it and Unblock the Notifications