రాజధాని నిర్మాణ పనులు ఆగిపోయాయనడం అసత్య ప్రచారం: చంద్రబాబు
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్రం మాట మీద నిలబడకపోయినా రాజధాని నిర్మాణ పనులు మాత్రం ఎక్కడా ఆగకూడదని అధికారులను సీఎం ఆదేశించారు. కేంద్రం ఇవ్వకపోయినా.. నిధుల సేకరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు.
ఈ ప్రణాళికకు ఆమోదం తెలపాలని కోరారు. తద్వారా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోకుండా ఉంటామని అధికారులకు సూచించారు. రాజధాని నిర్మాణానికి నిధులు అందించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నవేళ.. పనులు ఆగిపోతున్నాయని కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆ ప్రచారంలో నిజం లేదన్నారు.

రాజధానిలో చేపట్టిన పనులను డ్రోన్ల ద్వారా చిత్రీకరించి రెండు నిమిషాల లఘుచిత్రాలను ప్రతి నెలా సినిమా థియేటర్లలో, మీడియా ఛానళ్లలో ప్రదర్శించాలని చంద్రబాబు సూచించారు.
రాజధానిలో ప్రస్తుతం రూ.23,294 కోట్ల పనులు జరుగుతున్నాయని సీఎం వివరించారు. మొత్తం రూ. 48,115 కోట్లు అవసరం అవుతాయని, వివిధ ఆర్థిక సంస్థల నుంచి సమకూర్చుకోవడం వల్ల వడ్డీతో కలిపి వ్యయం రూ.51 వేల కోట్లు దాటుతుందని అంచనా వేశారు.
ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గాలపై అధికారులు సూచనలు చేశారు. రాజధానిలో కీలకమైన 5020 ఎకరాల భూమి ద్వారా నిధులను సమకూర్చుకునే అవకాశం ఉందని తెలిపారు. అలాగే రూ.38,590 కోట్ల మేర హడ్కో, వరల్డ్ బ్యాంక్ నుంచి రుణాలుగా తీసుకోవడానికి అవకాశం ఉందని సీఎంకు వివరించారు.












Click it and Unblock the Notifications