Bullet Train బిగ్ అప్‌డేట్: వచ్చే ఏడాదే పట్టాలపై పరుగులు!
దేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన మొదటి విడత ట్రాక్ వచ్చే ఏడాది (2027) లోనే అందుబాటులోకి రాబోతోందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన 'హైసియా' (HYSEA GCCS & IT) రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి.. దేశంలో తొలి హైస్పీడ్ రైలు కారిడార్ పనులు అత్యంత వేగంగా పురోగతి సాధిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది సూరత్-బిలిమోరా మధ్య మొదటి సెక్షన్‌ను అధికారికంగా ప్రారంభించి, ఆ తర్వాత మిగిలిన మార్గాలను దశలవారీగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు.
విడతల వారీగా ప్రారంభం..
బుల్లెట్ రైలు కారిడార్ ఓపెనింగ్ షెడ్యూల్‌ను మంత్రి అశ్విని వైష్ణవ్ వివరిస్తూ.. వచ్చే ఏడాది మొదటి సెక్షన్ ప్రారంభమైన వెంటనే మిగిలిన మార్గాలను కూడా వేగంగా అనుసంధానిస్తామని చెప్పారు. "సూరత్-బిలిమోరా తర్వాత వాపి నుంచి సూరత్ వరకు, ఆపై వాపి నుంచి అహ్మదాబాద్ వరకు లైన్లు అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత అహ్మదాబాద్ నుంచి ఠాణే, చివరగా అహ్మదాబాద్ నుంచి ముంబయి వరకు కారిడార్‌ను పూర్తి స్థాయిలో ఓపెన్ చేస్తాం" అని ఆయన పేర్కొన్నారు. ఈ ఫేజ్-బై-ఫేజ్ ఓపెనింగ్ ప్రక్రియ వచ్చే ఏడాది నుంచే నిరంతరాయంగా సాగుతుందన్నారు.

హైస్పీడ్ హబ్‌గా భాగ్యనగరం..
తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు బుల్లెట్ రైళ్ల కనెక్టివిటీపై మంత్రి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ నగరానికి మూడు సరికొత్త హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లను మంజూరు చేశారని, ఇవి భవిష్యత్తులో ఈ ప్రాంత రూపురేఖలనే మార్చేయబోతున్నాయని తెలిపారు. "పూణే-హైదరాబాద్, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు రూట్లలో రాబోయే హైస్పీడ్ కారిడార్లు రీజినల్ ఎకానమీని పూర్తిగా బలోపేతం చేస్తాయి. ఈ ప్రాజెక్టులతో హైదరాబాద్ ఒక పెద్ద హైస్పీడ్ హబ్‌గా మారి, ఇక్కడి ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుంది" అని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం డిజిటల్, ఎలక్ట్రానిక్స్ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాల వల్ల తెలంగాణకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరిందని, దాదాపు వందకు పైగా ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఇక్కడ ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. అలాగే రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల కోసం మోదీ ప్రభుత్వం రూ. 5,400 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందని, దీంతో మౌలిక వసతుల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని వివరించారు.
రైళ్లు నడుస్తుండగానే స్టేషన్ల పునర్నిర్మాణం!
దేశవ్యాప్తంగా సాగుతున్న రైల్వే స్టేషన్ల నవ-నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 261 స్టేషన్ల ఆధునీకరణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయని మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనుల గురించి ప్రస్తావిస్తూ.. ఇది అత్యంత సవాలుతో కూడుకున్న ప్రక్రియ అని వ్యాఖ్యానించారు.
"ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా రైల్వే స్టేషన్ రీడెవలప్‌మెంట్ చేయాలంటే రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారు. కానీ మనం అలా చేయలేం. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ స్టేషన్‌లో రైళ్లు నడుస్తుండగానే, ప్లాట్‌ఫారమ్‌ల పైన రూఫ్ లాంటి భారీ 'ఎయిర్ కాన్‌కోర్స్'ను నిర్మిస్తున్నాం. ప్రయాణికుల భద్రత, పనుల నాణ్యతకు పెద్దపీట వేస్తూ రైల్వే యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఈ పనులను పూర్తి చేస్తోంది" అని మంత్రి పేర్కొన్నారు.














Click it and Unblock the Notifications