TRS పార్టీకి గుర్తింపునివ్వండి! 105 నియోజకవర్గాల్లో జెండా ఎగరేశాం: కవిత
తాము ప్రతిపాదించిన 'తెలంగాణ రక్షణ సేన' పార్టీకి తక్షణమే గుర్తింపు ఇవ్వాలని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ECI) విజ్ఞప్తి చేశారు. ఈ నెల 7వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆమె శనివారం తన లిఖితపూర్వక సమాధానాన్ని (Reply) సమర్పించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ ఆదివారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్లకు అధికారికంగా లేఖ రాశారు. ఈ ఏడాది ఏప్రిల్ 28నే ఈసీ తమకు 'తెలంగాణ రక్షణ సేన' పేరును కేటాయిస్తూ లేఖ ఇచ్చిందని, ఆ నమ్మకంతోనే తెలంగాణవ్యాప్తంగా 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించి, సంస్థాగత నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకున్నామని లేఖలో వివరించారు.
పార్టీ రిజిస్ట్రేషన్‌పై సుమారు వెయ్యి అభ్యంతరాలు వచ్చాయని జూన్ 23న ఈసీ తమకు లేఖ రాసిందని, కానీ అందులో ఒక్క కాపీని కూడా తమకు పంపలేదని కవిత లేఖలో ఆక్షేపించారు. "ఆ అభ్యంతరాలు ఎవరు వ్యక్తం చేశారు? అందులో ఏముందో మాకు తెలియకుండా మేము ఎలా సమాధానం చెప్పగలం? మూడున్నర కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో కేవలం వెయ్యి మంది అభ్యంతరం తెలిపారనే సంఖ్యను చూపిస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవడం సరికాదు" అని పేర్కొన్నారు. ఎవరైనా కావాలనే గ్రూపులుగా ఏర్పడి, ప్లాన్ ప్రకారం ఇదంతా చేయించారా అనే కోణంలో పరిశీలించాల్సి ఉందన్నారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం తాము ఈసీ ఎదుట వ్యక్తిగత విచారణకు హాజరయ్యే ముందే.. ఆ 1000 అభ్యంతరాల కాపీలను, తమకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను అందజేయాలని, వాటిని పరిశీలించడానికి తగిన సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మాకెందుకు అభ్యంతరం?
'తెలంగాణ రక్షణ సేన' అనే పేరును తాము పూర్తి సదుద్దేశంతో, స్వతంత్రంగా ఆలోచించి పెట్టామని.. దేశంలో ఈ పేరుతో మరే ఇతర పార్టీ నమోదు కాలేదని కవిత స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల పేర్లను విడివిడి ముక్కలుగా చూడకూడదని, సమగ్రంగా చూడాలని హితవు పలికారు. ఈసీ ప్రస్తావిస్తున్న "తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రాటిక్)", "తెలంగాణ రాజ్య సమితి" అనేవి విభిన్న ఉచ్చారణ, గుర్తింపు, నాయకత్వం కలిగిన వేర్వేరు పేర్లని వివరించారు. ఒక్క తెలంగాణలోనే ఇలాంటి రెండు పార్టీలకు గుర్తింపు ఇచ్చినప్పుడు, తమ పార్టీపై అభ్యంతరాలు ఎందుకని ప్రశ్నించారు. దేశంలో ఆమ్ ఆద్మీ, అఖండ్ భారత్, మక్కల్, రాష్ట్రీయ జనతా, శిరోమణి వంటి ఒకే రకమైన సిద్ధాంత, భౌగోళిక పదాలతో వందలాది పార్టీలు రిజిస్ట్రేషన్ పొంది ఉన్న విషయాన్ని లేఖలో గుర్తుచేస్తూ.. దానికి సంబంధించిన జాబితాను కూడా ఈసీకి జతచేశారు.
ఆ ఊహాజనిత అభ్యంతరాలను తిరస్కరించండి
కేవలం సాధారణ భౌగోళిక వర్ణనలు, ఊహాజనిత సంక్షిప్త రూపాల (Abbreviations) ఆధారంగా వచ్చిన అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చాలని కవిత కోరారు. ఇప్పుడు హఠాత్తుగా పేరు మార్చుకోవాలని చెబితే పార్టీగా తాము తీవ్రంగా నష్టపోతామని, అది తమకు అన్యాయం చేయడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 29A కింద తాము చేసుకున్న దరఖాస్తును నిష్పాక్షికంగా, హేతుబద్ధంగా పరిశీలించి.. పూర్తి కారణాలతో కూడిన స్పష్టమైన ఆదేశాల ద్వారా 'తెలంగాణ రక్షణ సేన' పార్టీ గుర్తింపును ఆమోదించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆమె విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications