తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ - TTD కీలక సూచనలు..!!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా తిరుమలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ రోజు ఉదయానికి తిరుమలకు భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం సర్వదర్శన భక్తులను పాచికాలువ ఆలయం నుంచి బాట గంగమ్మ ఆలయం శాశ్వత క్యూలైన్ లోకి అనుమతిస్తున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ కార్యాచరణ అమలు చేస్తోంది. ఇక.. భక్తుల రద్దీ పెరగటంతో దర్శనాల పై టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. పెరటాసి మాసం మూడో వారం కావడంతో భక్తులతో తిరుమల గిరులు కిక్కిరిసిపోయాయి. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండాయి. క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు నిరంతరా యంగా అల్పాహారం,నీరు, పాలు అందజేస్తున్నారు. మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా ఇవాళ, అక్టోబర్ 5న సిఫార్సు లేఖలపై ఇచ్చే దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఇది వరకే టీటీడీ ప్రకటించింది. అయితే ఈ విషయం తెలియని కొందరు భక్తులు సిఫార్సు లేఖలను తీసుకొని అదనపు ఈవో కార్యాలయానికి వచ్చారు. తప్పని పరిస్థితిలో టీటీడీ అధికారులు వారిని 300 రూపాయల ప్రత్యేక దర్శనాలకు అనుమతించారు. అక్టోబర్ 5వ తేదీ సోమవారం ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం జరిగింది.

టీటీడీ కీలక నిర్ణయాలు
కాగా, ప్రస్తుతం రోజుకు సుమారు 80 వేల మంది భక్తులకు స్వామివారి దర్శనం చేయించడం జరుగుతోంది. అయినప్పటికీ అదే రోజు అదనంగా వచ్చి దర్శనానికి నిరీక్షించే దాదాపు 30 వేల మంది భక్తులు తర్వాత రోజు స్వామివారిని దర్శించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో సామాన్య భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే సమయం మరింత పెరుగుతోంది. ఈ కారణంగా అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 4వ తేది ఆదివారం సిఫార్సు లేఖలు స్వీకరించరని టీటీడీ స్పష్టం చేసింది. అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయాల ను గమనించి సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.













Click it and Unblock the Notifications
