రైతున్నలకు కేంద్రం భారీ బంపర్ గిఫ్ట్.. సింహభాగం డబ్బులు ఈ రాష్ట్రానికే
వ్యవసాయ రంగంలో ప్రతి అన్నదాత కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మరో చారిత్రక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ధరలు పడిపోయి రైతులు నష్టపోకుండా ఉండేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ముందడుగు వేశారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2026-27 కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పప్పుధాన్యాలు, నూనెగింజలను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయడానికి భారీ మొత్తాన్ని ఆమోదించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతుల సంక్షేమం, వారి ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్‌కు సింహభాగం..
ప్రకటించిన నిధుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పెద్దపీట వేశారు. యూపీలో దాదాపు రూ. 3,992.57 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా రూ. 3,937.70 కోట్ల విలువైన 4,66,000 మెట్రిక్ టన్నుల కందులు, అలాగే రూ. 54.87 కోట్ల విలువైన 6,250 మెట్రిక్ టన్నుల పెసర్లను నేరుగా ఎంఎస్పీ ధరకు సేకరించనున్నారు. ఈ నిర్ణయం వల్ల యూపీలోని వేలాది మంది రైతులకు మార్కెట్ ధరల నుంచి రక్షణ లభించనుంది.

కర్ణాటక, తెలంగాణ రైతులకు కూడా భారీ ఊరట
కేవలం ఉత్తరప్రదేశ్‌కే కాకుండా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కోట్లాది రూపాయల కొనుగోళ్లకు ఆమోదం తెలిపారు. కర్ణాటకలో రూ. 1,107 కోట్ల విలువైన పంటల కొనుగోలుకు పీఎస్ఎస్ (PSS) కింద అప్రూవల్ లభించింది. ఇందులో సోయాబీన్, పెసర్లు, పొద్దుతిరుగుడు పంటలు ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రూ. 448.42 కోట్ల విలువైన కొనుగోళ్లకు కేంద్రం అనుమతిచ్చింది. ఇందులో సుమారు 62,000 మెట్రిక్ టన్నుల సోయాబీన్, 10,766 మెట్రిక్ టన్నుల పెసర్లు మద్దతు ధరకు సేకరించనున్నారు.
దేశాన్ని స్వయంసమృద్ధి వైపు నడిపించే దిశగా అడుగులు
ఈ సందర్భంగా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిలో భారత్‌ను ఆత్మనిర్భర్ సాధించేలా చేయడమే లక్ష్యంగా ఈ కొనుగోళ్లు దోహదపడతాయని తెలిపారు. మార్కెట్లో కృత్రిమ కొరతలు రాకుండా, దళారీ వ్యవస్థకు తావులేకుండా పారదర్శకమైన విధానంలో ఈ కొనుగోళ్లు జరుగుతాయని భరోసా ఇచ్చారు. కొనుగోలు చేసిన పంటలకు సంబంధించిన డబ్బులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకే జమ చేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.














Click it and Unblock the Notifications
