ఆ ఉద్యోగాలు హాట్ కేక్స్..! యూత్ రెడీగా ఉండండి-సాయిరెడ్డి టిప్స్..!
ఏపీలో ఒకప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా పార్టీలో, ప్రభుత్వంలో ఓ రేంజ్ లో చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి(Vijayasai Reddy).. పార్టీ అధికారం కోల్పోయాక క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు. అయితే ఆ తర్వాత యూటర్న్ తీసుకుని రాజకీయాలతో పాటు అన్ని అంశాలపై సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అంతే కాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యువతకు కూడా ఆయన ఇప్పుడు సలహాలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో యువతకు భవిష్యత్ ఉద్యోగాలకు సంబంధించి సాయిరెడ్డి ఓ సూచన చేశారు.
భారతదేశంలో ఏఐ ఇంజనీరింగ్ ఉద్యోగ ప్రకటనలు 59.5% వృద్ధి చెందుతుండగా, అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీలలో కూడా బలమైన వృద్ధి కనిపిస్తోందని విజయసాయిరెడ్డి నిరుద్యోగ యువతకు తెలిపారు. మన యువత ప్రతి కొత్త సాంకేతిక విప్లవానికి అవసరమైన నైపుణ్యాలను కలిగి, సిద్ధంగా ఉండటం చాలా ముఖ్యమని సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు ఏఐ అయితే, రేపు క్వాంటం, అధునాతన రోబోటిక్స్, బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లు (BCI) వస్తాయన్నారు. భవిష్యత్తు ఉద్యోగాలు రాకముందే మనం వాటికి సిద్ధం కావాలని సాయిరెడ్డి యూత్ కు సూచించారు.

ఇప్పటికే ఏఐ, క్వాంటం టెక్నాలజీ వంటి అంశాల్లో చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం అమరావతిలో హడావిడి చేస్తోంది. ఇలాంటి సమయంలో అవే అంశాల్ని యూత్ కు సూచిస్తూ తమ కెరీర్ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాలని సాయిరెడ్డి చేసిన సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఛార్టర్డ్ అకౌంటెంట్ గా కెరీర్ ప్రారంభించి ఆడిటర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన సాయిరెడ్డి... ఇప్పుడు తాను ఎంచుకున్న రంగాన్ని కాదని ఇతర రంగాలవైపు మళ్లాలని యువతకు సూచిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications