జగన్ చేతికి కూటమి బ్రహ్మాస్త్రం - అక్కడే బిగ్ టర్న్..!!
ఏపీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసిపి, టిడిపి కూటమి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది. వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ తిరిగి తన అధికారం దక్కించుకోవడం పైన పూర్తి విశ్వాసంతో ఉన్నారు. తాజాగా చోటు చేసుకున్న కీలక పరిణామాలను జగన్ అనుకూలంగా మలుచుకుంటున్నారు. కీలకమైన పోలింగ్ వేళ ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.
జగన్ కొత్త వ్యూహం
ఏపీలో ఈనెల 13న పోలింగ్ జరగనుంది. పార్టీల అధినేతలు తుది దశ ప్రచారంలో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి జగన్ తన ప్రతి ప్రచార సభలో తన హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాదని చెప్పుకొస్తున్నారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని విషయాన్ని ప్రధానంగా వివరిస్తున్నారు.

మూడు పార్టీల కూటమి కలయిక గురించి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజమండ్రి సభలో ప్రధాని మోడీ వైసీపీ ప్రభుత్వం పైన పలు ఆరోపణ చేశారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి జగన్ ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సభలో ఢిల్లీ పీఠాన్ని కదిలిద్దామంటూ పిలుపునిచ్చారు.
జగన్ ధీమా వెనుక
జగన్ తొలినుంచి పూర్తిగా సంక్షేమ ఓట్ బ్యాంకు పైనే నమ్మకం పెట్టుకున్నారు. జగన్ పాలనలో రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ చంద్రబాబుతో సహా పలువురు నేతలు విమర్శలు చేశారు. అయితే చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలో జగన్ కంటే తాను మెరుగైన సంక్షేమం పెద్ద సంఖ్యలో పథకాలు అందిస్తానంటూ చంద్రబాబు చెప్పుకోవడం జగన్ పాలిట వరమైంది.
జగన్ తన మేనిఫెస్టోలో గత పథకాలను కొనసాగిస్తూ అమ్మ ఒడి, రైతు భరోసా, పెన్షన్లను కొంతమెర పెంచారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలతో పాటుగా జగన్ అమలు చేస్తున్న కొన్ని పథకాలను తన మేనిఫెస్టోలో చేర్చారు. సంక్షేమంతో పాటుగా అభివృద్ధి అందిస్తానని... తన సంక్షేమ పథకాలకు సంపద సృష్టించే శక్తి తనకు ఉందని ప్రచారం చేసుకుంటున్నారు. జగన్ తన మేనిఫెస్టో ప్రకటన సమయంలో చంద్రబాబు హయాంలో 14 ఏళ్ల పాలన లోటు బడ్జెట్ తో కొనసాగిందని లెక్కలతో సహా వివరించారు.
ఎన్నికల్లో బిగ్ టర్న్
ఇదే సమయంలో టిడిపి సంక్షేమ మేనిఫెస్టో పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదని జగన్ గుర్తించారు. చంద్రబాబు చెప్పిన ఏది అమలు చేయరని ఆయన విశ్వసనీయతను దెబ్బతీయటంలో జగన్ కొంతమేర సక్సెస్ అయ్యారు. ఇక ఎన్నికల సమయంలో సంక్షేమ పథకాలు అమలుకాకుండా ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలు వెనక చంద్రబాబు అండ్ కో ఉందని ప్రచారం మొదలైంది. ఏప్రిల్, మే నెలలో పెన్షన్ల పంపిణీ విషయంలో జరిగిన గందరగోళానికి చంద్రబాబు కారణమని వైసిపి బలంగా ఆరోపణ చేసింది.
లబ్ధిదారులు చంద్రబాబుని టార్గెట్ చేశారు. ఇప్పుడు పథకాల విషయంలోనూ అదే జరుగుతుంది. దీంతో ప్రతి పథకంలోనూ లక్షల సంఖ్యలో ఉన్న లబ్ధిదారులు చంద్రబాబుకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని వైసిపి అంచనా వేస్తుంది. ఫలితంగా సంక్షేమ ఓట్ బ్యాంక్ తమతోనే ఉంటుందని.. తమ విజయం ఖాయమని జగన్ పూర్తి ధీమాతో కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications