మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం పెట్టిన జగన్: గవర్నర్‌తో భేటీ అందుకేనా?
అమరావతి: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరినట్టే కనిపిస్తోంది. శాసన మండలి ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో- తన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తోన్నట్టే. ఈ ఎన్నికల్లో గెలిచిన కొందరికి కేబినెట్ బెర్త్ కల్పించాలనే ఉద్దేశంలో ఆయన ఉన్నట్లు ఇదివరకే అంచనాలు వ్యక్తం అయ్యాయి. ఆ అంచనాలన్నీ ఇక వాస్తవ రూపాన్ని దాల్చడం దాదాపుగా ఖాయమైనట్టే.
ఈ సాయంత్రం వైఎస్ జగన్- రాజ్‌భవన్‌లో గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మంత్రివర్గ విస్తరణ కోసమే ఆయన గవర్నర్‌ను కలిశారని తెలుస్తోంది. మండలి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మంత్రివర్గ ప్రక్షాళన ఉండొచ్చంటూ ఇదివరకే వార్తలొచ్చాయి. ఆశించిన స్థాయిలో పనితీరును కనపర్చని మంత్రులను జగన్ సాగనంపుతారని, వారి స్థానంలో మండలి ఎన్నికల్లో గెలిచిన వారికి అవకాశం కల్పిస్తారనే అభిప్రాయాలు వెలువడ్డాయి.

ఇప్పుడు తాజాగా వైఎస్ జగన్ కూడా ఆ ఆలోచనలోనే ఉన్నారని, అందుకోసమే ఆయన గవర్నర్ ను కలిశారని సమాచాం. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో- తన ఎలక్షన్ టీమ్ ను జగన్ సిద్ధం చేసుకుంటోన్నారని, అందులో భాగంగా- మంత్రివర్గ ప్రక్షాళన చేయనున్నారని అంటున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో జగన్ భేటీ అయిన నేపథ్యంలో- ఈ నెల 30 లేదా 31వ తేదీన మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో- వైఎస్ఆర్సీపీ నుంచి మర్రి రాజశేఖర్, బొమ్మి ఇజ్రాయిల్, పోతుల సునీత, చంద్రగిరి ఏసురత్నం, పెన్మత్స సూర్యనారాయణ రాజు, జయమంగళ వెంకటరమణ విజయం సాధించిన విషయం తెలిసిందే. మిగిలిన కోటాల్లో నర్తు రామారావు, వంకా రవీంద్ర, కావూరు శ్రీనివాస్, మధుసూదన్, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, ఎస్ మంగమ్మ, సిపాయి సుబ్రమణ్యం, మేరుగ మురళీధర్, కుడిపూడి సూర్యనారాయణ విజయం సాధించారు. వీరిలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది.
మంత్రివర్గ ప్రక్షాళనలో ముగ్గురు నుంచి అయిదుమంది వరకు కొత్తవారికి స్థానం కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరికి ఉద్వాసన పలుకుతారనేది ఉత్కంఠతను రేపుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కూడా వైఎస్ జగన్ ఈ దిశగా సంకేతాలను పంపించినట్లు సమాచారం. నియోజకవర్గాల నుంచి క్షేత్రస్థాయిలో అందిన నివేదికల ఆధారంగానే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications