చిన్నారికి నామకరణం చేసిన జగన్ మామయ్య- తన ఊత పదాన్నే పేరుగా మార్చిన సీఎం
అమలాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రస్తుతం వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తోన్నారు. తొలి రోజు- ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. కూనవరం, వీఆర్ పురం మండలాల్లో వరద ప్రభావిత గ్రామాల ప్రజలను స్వయంగా కలుసుకున్నారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం అందించిన సహాయక చర్యల గురించీ ఆరా తీశారు. అనంతరం ఆయన రాజమండ్రికి చేరుకుని.. రాత్రి అక్కడే బస చేశారు. ఇవ్వాళ- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తోన్నారు. వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లో కలియతిరిగారు. ముమ్మిడివరం, పీ.గన్నవరం నియోజకవర్గాల పరిధిలోని గురజపులంక, కూనలంక గ్రామాల్లో వరద బాధితులను పరామర్శించారు.

పేదలకు సహాయం అందించే విషయంలో తమ ప్రభుత్వ ఎప్పుడూ వెనకడుగు వేయబోదని జగన్ తేల్చి చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వరద ప్రభావం వల్ల తక్కువ నష్టపోయిన బాధితులకూ 10,000 రూపాయల పరిహారం చెల్లిస్తామని అన్నారు. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్‌తో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు.
పంట నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని జగన్ అధికారులను ఆదేశించారు. పేరు, విస్తీర్ణం, పంట నష్టం వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామని, ఆ జాబితాలో ఎవరి పేరయినా లేకపోతే ఆర్‌బీకేల్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ప్రజలకు సహాయం అందలేదని, కలెక్టర్ సరిగ్గా పని చేయలేదనే మాట తనకు వినిపించకూడదని అన్నారు.

ఈ సందర్భంగా కూనలంక గ్రామంలో ఓ దంపతులు తమ కుమారుడితో సహా జగన్ వద్దకు వచ్చారు. వారి చేతుల్లో ఉన్న బాబును జగన్ ఎత్తుకుని ముద్దాడారు. బాబుకు ఏం పేరు పెట్టారని అడిగారు. దీనికి వారు ఇంకా పేరు పెట్టలేదని, డీ అనే ఆంగ్ల అక్షరంతో పేరు పెట్టాలని చెప్పారు. మీకు నచ్చిన పేరు ఏమిటని జగన్ అడగ్గా- మీరే పెట్టాలని కోరారు.
దీనికి జగన్- ఆ చిన్నారిని ముద్దాడి.. దేవుడు అని పేరు పెట్టారు. దేవుడు అనే పదాన్ని జగన్ తరచూ వాడుతుంటారు. పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు.. దేవుడి చల్లని చూపులతో.. దేవుడి చల్లని దీవెనలతో.. అనే పదాన్ని ప్రతి సందర్భంలోనూ వాడుతుంటారాయన. ఇప్పుడదే పదాన్ని పేరుగా పెట్టారు.












Click it and Unblock the Notifications