దూసుకొస్తున్న జవాద్: ఉత్తరాంధ్రకు తుఫాన్ గండం; సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు మాత్రం వదలడం లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇటీవల కురిసిన వర్షాలు అతలాకుతలం చేశాయి. ఏపీ ఆ నష్టం నుండి ఇంకా కోలుకోకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ముప్పు దూసుకొస్తోంది. జవాద్ తుఫాను ఏపీ తీరం వైపు దూసుకొస్తున్నదని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుఫాను ప్రభావం ప్రధానంగా ఉత్తరాంధ్ర పై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది.

ఉత్తరాంధ్ర తుఫాన్ హెచ్చరికల నేపధ్యంలో జగన్ సమీక్షా సమావేశం
ఉత్తరాంధ్ర తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా ఆయా జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ముందస్తుగా జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జగన్ సూచించారు. అవసరమైన అన్ని చోట్ల సహాయక శిబిరాలు నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేయాలని లోతట్టు ప్రాంతాలను, ముంపు ప్రాంతాలను గుర్తించి, అక్కడి ప్రజలను ముందే అప్రమత్తం చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచనలు చేశారు.

తుఫాను ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్న జగన్,
తుఫాన్ వల్ల ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల కారణంగా ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఎక్కడ ప్రాబ్లం ఉందో ముందుగానే గుర్తించి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. అంతేకాదు తుఫాన్ సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం ముగ్గురు సీనియర్ అధికారులను నియమించిన జగన్ వారిని ఆయా జిల్లాలకు చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆదేశించారు.

ముగ్గురు సీనియర్ అధికారులకు బాధ్యతలు
శ్రీకాకుళం జిల్లాకు హెచ్ అరుణ్ కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్ దండే, విశాఖ జిల్లాకు శ్యామలరావును నియమించిన జగన్ తక్షణమే అధికారులు ఆయా జిల్లాలకు చేరుకోవాలని ఆదేశించారు. సహాయ కార్యక్రమాల సమన్వయ బాధ్యతను, పర్యవేక్షణ బాధ్యతను వారు నిర్వర్తించాలని, కిందిస్థాయి అధికారులకు సూచనలు సలహాలు ఇస్తూ, తుఫాను పరిస్థితులను పర్యవేక్షించాలని జగన్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర కు తుఫాను గండం పొంచి ఉన్న నేపథ్యంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఏపీ సీఎం జగన్.

జవాద్ తుఫాను దూసుకొస్తుందన్న వాతావరణ శాఖ
ఇదిలా ఉంటే దక్షిణ థాయిలాండ్ పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడి అండమాన్ సముద్ర పరిసరాల్లో ప్రవేశించి పశ్చిమ వాయువ్యంగా పయనించి గురువారానికి వాయుగుండంగా మారి ఆగ్నేయం తూర్పు మధ్య బంగాళాఖాతంలో కి ప్రవేశిస్తుందని, ఆ తర్వాత అది 24 గంటల్లో వాయువ్యంగా పయనించి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖాధికారులు చెప్తున్నారు. ఈ తుఫాను శనివారం ఉదయానికి ఉత్తరాంధ్ర తీరం దిశగా రానుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుఫాన్ కు జవాద్ తుఫాన్ అని నామకరణం చేశారు.

జవాద్ తుఫాన్ ఎఫెక్ట్ ఉండేది ఈ జిల్లాల పైనే ..
జవాద్ తుఫాను ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో, దీని ప్రభావంతో శుక్రవారం నుండి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, దక్షిణ ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఉభయగోదావరి జిల్లాల లోనూ తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం జగన్ ఉత్తరాంధ్ర కు పొంచి ఉన్న జవాద్ గండం పై ప్రత్యేకంగా ఫోకస్ చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications