విశాఖపట్నంపై జగన్ తుది నిర్ణయం..!!
విశాఖపట్నం: సాగరనగరం విశాఖపట్నానికి రాజధానిని తరలించాలనే ప్రతిపాదనలను ఎప్పటినుంచో ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే మూడు రాజధానుల అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినప్పటికీ- కొన్ని న్యాయపరమైన అడ్డంకుల వల్ల ఇవి కార్యరూపం దాల్చట్లేదు.
ఈ ఏడాది మాత్రం విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా బదలాయించాలనే పట్టుదలతో ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ దిశగా దూకుడును పెంచింది. ఒకవంక కొత్త బిల్లుపై కసరత్తు పూర్తి చేస్తూనే మరోవంక- నిర్మాణాలకూ పూనుకుంది. విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించబోతోన్నామని, తాను కూడా అక్కడికే తరలి వెళ్లబోతోన్నానంటూ వైఎస్ జగన్ సైతం ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో జాప్యం చేయకూడదనే నిర్ణయానికి వచ్చింది.

ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి సచివాలయాన్ని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలిస్తామంటూ గతంలో వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఎలాంటి రాజీ ధోరణిని పాటించే ప్రసక్తే లేదని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమౌతుందనీ అప్పట్లో వెల్లడించారాయన.
విశాఖపట్నంలో అనేక ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయని, వాటి నుంచి పరిపాలన సాగిస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. భీమిలి రోడ్డులో ఖాళీగా ఉన్న వాటిని ప్రభుత్వ భవనాలుగా వినియోగిస్తామని పేర్కొన్నారు. విశాఖపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి చెందిన భవనాలు కూడా ఖాళీగా ఉన్నాయని అన్నారు. భీమిలి రోడ్డులోని భవనాలనే గా వాడుకుంటామనీ వైవీ సుబ్బారెడ్డి వివరించారు.
ఇదే విషయంపై ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కూడా ఇటీవలే మాట్లాడారు. దసరాకు విశాఖ ప్రజల కోరిక తీరబోతోందని, వైఎస్ జగన్ ఇక్కడి నుంచి పరిపాలన సాగించబోతోన్నారనీ అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

దీనిపై తాజాగా మరో అప్‌డేట్ వెలువడింది. అక్టోబర్ 24వ తేదీన వైఎస్ జగన్.. విశాఖకు తరలి వెళ్లనున్నారు. విజయ దశమిని పురస్కరించుకుని విశాఖపట్నంలోని రిషికొండలో కొత్తగా నిర్మితమౌతోన్న భవనానికి తన నివాసాన్ని తరలించనున్నారు. విజయదశమి నాడు ఆయన గృహ ప్రవేశం చేయనున్నారు. అక్కడి నుంచే పరిపాలన సాగిస్తారు.
దీనికి అనుగుణంగా క్యాంప్ కార్యాలయం, నివాసాన్ని నిర్మిస్తోన్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం మొత్తాన్ని కూడా రిషికొండకు తరలిస్తారు దశలవారీగా. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం కూడా శరవేగంగా నిర్మాణాన్ని జరుపుకొంటోంది. విజయదశమి నాటికే కేంద్ర కార్యాలయం కూడా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications