నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్
YS Jagan: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగియనుంది. ప్రస్తుతం ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని సారవకోట మండలం అక్కివలస వద్ద జగన్ బస చేశారు.
ఈ ఉదయం 9 గంటలకు అక్కివలస నైట్ క్యాంప్ నుంచి బయలుదేరుతారు. ఎచ్చెర్ల, కుశాలపురం, శ్రీకాకుళం బైపాస్, పలివలస, నరసన్నపేట క్రాస్, గట్లపాడు, వండ్రాడ, ఎత్తురాళ్లపాడు, కోటబొమ్మాలి మీదుగా పరశురాంపురం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పరశురాంపురం జంక్షన్ వద్ద భోజన విరామం తీసుకుంటారు.

అనంతరం సాయంత్రం 4 గంటలకు పరశురాంపురం నుంచి బయలుదేరుతారు. అక్కవరానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 5:30 గంటల వరకు సభ కొనసాగుతుంది. జిల్లాకు చెందిన మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇందులో పాల్గొంటారు. వారిని జగన్ పరిచయం చేస్తారు. సభ అనంతరం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్తారు.
గురువారం పులివెందులకు బయలుదేరి వెళ్లనున్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. నామినేషన్ వేసిన అనంతరం పులివెందులలో బహిరంగ సభలో పాల్గొంటారు. రోడ్ షోను నిర్వహిస్తారు.
ఉదయం 8:15 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుంటారు. కడప విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో పులివెందులలోని భాకరాపురానికి వస్తారు. 10 గంటలకు పులివెందులలో బహిరంగ సభలో పాల్గొంటారు. 11:25 నిమిషాలకు పులివెందుల మినీ సెక్రెటేరియట్‌లో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.












Click it and Unblock the Notifications