రేపు విశాఖకు సీఎం వైఎస్ జగన్.. శారదా పీఠం వార్షిక మహోత్సవం కోసం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం విశాఖపట్నం వెళ్లనున్నారు. పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ముగింపు కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇందుకోసం రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి జగన్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు. అక్కడినుంచి విమానం ద్వారా 10.10గంటలకు విశాఖకు చేరుకుంటారు. విశాఖ విమానాశ్రయం నుంచి 10.40 గంటలకు చినముషిడివాడలోని శారదా పీఠానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30గంటల వరకు అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.10గంటలకు తాడేపల్లిలోని స్వగృహానికి చేరుకుంటారు.

కాగా,తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్‌లకు విశాఖ పీఠంతో సన్నిహిత సంబంధాలున్న సంగతి తెలిసిందే. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత స్వరూపానందేంద్ర సరస్వతి జగన్‌పై తన ప్రేమను చాటుకున్నారు. 'నా హృదయంలో ఒక ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి జగన్. ఆయనంటే నాకు పరమ ప్రాణం. ఆయన గెలుపు కోసం విశాఖ శారదా పీఠం ఐదేళ్లు శ్రమించింది. శారదా పీఠం జగన్ అంటే ప్రాణం పెట్టింది. అక్కడ దేన్ని కదిపినా.. జగన్ గెలవాలి, రాష్ట్రానికి మంచి చేయాలని కోరుకుంది. ఇటు జగన్, అటు కేసీఆర్ 15 ఏళ్లు దిగ్విజయంగా తెలుగు రాష్ట్రాలను పాలించాలని కోరుకుంటున్నా. అంతవరకు శారదాపీఠం తపస్సు చేస్తూనే ఉంటుంది.' గతంలో ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications