బటన్ నొక్కబోతోన్న వైఎస్ జగన్- ఇంకొన్ని గంటల్లో..!!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకాల్లో ఒకటి- జగనన్న తోడు. రాష్ట్రంలోని చిరు వ్యాపారుల కోసం ఉద్దేశించిన పథకం ఇది. దీనికింద లబ్దిదారులకు 10 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటివరకు మూడు విడతల్లో నిధులను విడుదల చేసింది.
ఇక నాలుగో విడత జగనన్న తోడు పథకం కింద నిధుల విడుదల గడువు సమీపించింది. బుధవారమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్- నాలుగో విడత జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన ఈ పథకం కింద బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు.

లబ్దిదారులకు 10,000 రూపాయల చొప్పున నిధులను మంజూరు చేయనున్నారు వైఎస్ జగన్. దీనిపై లబ్దిదారులు చెల్లించాల్సిన వడ్డీ భారాన్ని ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, చేతివృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా 395 కోట్ల రూపాయల మేర రుణాలను అందించనున్నారు.
దీనితో పాటు ఆరు నెలలకు సంబంధించిన 15.17 కోట్ల రూపాయల మేర వడ్డీ రీఎంబర్స్‌మెంట్ ను కూడా వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు. జగనన్న తోడు పథకం కింద చెల్లించాల్సిన వడ్డీ మొత్తం ఇది. తోపుడు బండ్లు, ఫుట్ పాత్ వ్యాపారులు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లను నడిపే వారు ఈ పథకం కింద రుణాలను పొందడానికి అర్హులు.
ఈ పథకం కింద బ్యాంకుల్లో ఒక్కో చిరు వ్యాపారికి 10,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని ప్రభుత్వం అందిస్తోంది. దీనికి అయ్యే వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా లబ్దిదారులకు అందిస్తుంది. దీన్ని నాలుగో విడతగా వైఎస్ జగన్ అందించనున్నారు. తాజాగా విడుదల చేయనున్న 395 కోట్ల రూపాయల రుణంతో కలిపి ఇప్పటివరకు రూ.15,31,347 మంది చిరు వ్యాపారులకు 2,406 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం విడుదల చేసినట్టవుతుంది.












Click it and Unblock the Notifications