సంక్రాంతి వేళ.. వైఎస్ జగన్ అలా- చంద్రబాబు ఇలా
అమరావతి: రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఇవ్వాళ్టి నుంచే పాఠశాలలకు సెలవులు ఆరంభం అయ్యాయి. ఈ నెల 19వ తేదీ వరకు సెలవులే. సంక్రాంతి పండగను తమ సొంతూరిలో జరుపుకోవడానికి బయలుదేరి వెళ్లే వారితో బస్సులు, రైళ్లు ఫుల్ అవుతున్నాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా హైదరాబాద్ సగం ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోంది. వందల సంఖ్యలో ప్రయాణికులు బస్సులు, రైళ్ల ద్వారా సొంతూర్లకు తరలి వెళ్తోన్నారు.
పొరుగు రాష్ట్రాల్లో స్థిరపడిన వారు పల్లెబాట పట్టారు. హైదరాబాద్, బెంగళూరు నుంచి వందల సంఖ్యలో తెలుగు ప్రజలు తమ స్వస్థలాలకు చేరుకుంటోన్నారు. హైదరాబాద్ వందల సంఖ్యలో వాహనాలు ఏపీ వైపు పరుగులు పెడుతున్నాయి. స్వస్థలాలకు చేరుకునే వారితో పల్లెటూర్లన్నీ కళకళలాడుతున్నాయి.
సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులతో అటు బస్టాండ్, రైల్వే స్టేషన్లు క్రిక్కిరిసిపోతున్నాయి. కొద్దిరోజుల ముందే షెడ్యూల్ ఆర్టీసీ బస్సుల్లో సీట్లన్నీ బుక్ అయ్యాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడిపిస్తోన్నారు. ఇదివరకు ఈ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం మేర అదనపు ఛార్జీలను వసూలు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. సాధారణ ఛార్జీలనే తీసుకుంటోన్నారు.

కాగా- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం తాడేపల్లిలోని తన నివాసంలో సంక్రాంతి వేడుకలను జరుపుకోనున్నారు. ప్రాంగణంలో నిర్మించిన గోశాలలో భార్య వైఎస్ భారతితో కలిసి గోపూజ చేయనున్నారు. గోపూజతో సంక్రాంతి సంబరాలకు జగన్ శ్రీకారం చుట్టనున్నారు. గత ఏడాది సంక్రాంతి సమయంలోనూ భార్యతో కలిసి ఇక్కడే సంక్రాంతి పండగను జరుపుకొన్నారాయన. ఇంటి ఆవరణలో భోగి మంటలు వేయనున్నారు.
సంక్రాంతిని పురస్కరించుకుని జగన్ నివాసంలో ఉన్న గోశాలను అందంగా అలంకరించారు. తెలుగుదనం ఉట్టిపడేలా అక్కడి వాతావరణాన్ని తీర్చిదిద్దారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు, చంద్రగిరి శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. వివిధ రకాల పూలతో గోశాలను అలంకరించారు. ఉదయం 10 గంటలకు ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి.

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా చిత్తూరు జిల్లాలోని తన సొంతూరు నారావారిపల్లిలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్న విషయం తెలిసిందే. దీనికోసం తన కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పటికే నారావారిపల్లికి చేరుకున్నారు. చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ కూడా ఇందులో పాల్గొననున్నారు. ఈ సాయంత్రం బాలకృష్ణ నారావారిపల్లికి వెళ్లారు.












Click it and Unblock the Notifications