జగన్ గుడ్ న్యూస్.. ఖాతాల్లో డబ్బులు జమ
అమలాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల్లో ఒకటి- సున్నా వడ్డీ పథకం. దీనికింద డ్వాక్రా మహిళలకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులను జమ చేస్తోంది. ఇప్పటికే పలు దఫాల్లో వారి ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. ఇక మరో విడతలో సున్నా వడ్డీ పథకం కింద నిధులు జమ కానున్నాయి.
ఈ నెల 11వ తేదీన ఈ పథకం కింద నిధులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం వైఎస్ జగన్.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. అమలాపురంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. బటన్ నొక్కడం ద్వారా స్వయం సహాయక బృందాల సభ్యుల ఖాతాల్లోని నిధులను నేరుగా జమ చేయనున్నారాయన.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎల్లుండి ఉదయం 9:20 నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి అమలాపురానికి బయలుదేరి వెళ్తారు. అమలాపురం మండలం జనుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తారు. సభ ముగిసిన అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆయా సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేస్తూ వస్తోంది జగన్ ప్రభుత్వం. అమ్మఒడి, విద్యా దీవెన, వాహన మిత్ర, జగనన్న తోడు, వసతి దీవెన, చేయూత, కాపునేస్తం వంటి వాటిని అమలు చేస్తోంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను మరింత ముమ్మరం చేస్తోంది ప్రభుత్వం.












Click it and Unblock the Notifications