జగన్ గుడివాడ పర్యటన ఫిక్స్: పండగలా
మచిలీపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. శుక్రవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. గుడివాడలో టిడ్కో ఇళ్లను ప్రారంభించనున్నారు. వాటి పట్టాలను లబ్దిదారులకు అందజేయనున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గం కావడం వల్ల అందరి దృష్టీ ఈ కార్యక్రమం మీదే నిలిచింది. నిజానికి- ఈ నెల 9వ తేదీ నాడే ఈ పర్యటన షెడ్యూల్ అయినప్పటికీ అది వాయిదా పడిన విషయం తెలిసిందే.
గుడివాడ నియోజకవర్గం పరిధిలోని మల్లాయపాలెంలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయాన్ని జగన్ ఈ నెల 9వ తేదీ నాడే ప్రారంభించాల్సి ఉంది. మొత్తం 8,912 ఇళ్లతో కూడిన టిడ్కో కాలనీ అది. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
జిల్లాకు చెందిన గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని దగ్గరుండి వాటిని పర్యవేక్షించారు.

గుడివాడ పర్యటనకు సంబంధించి వైఎస్ జగన్ షెడ్యూల్‌ను కూడా అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయం ఖరారు చేసింది. చివరి నిమిషంలో అనూహ్యంగా ఈ పర్యటన వాయిదా పడింది. తాజాగా దీన్ని శుక్రవారానికి ఖరారు చేశారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మల్లాయపాలెం చేరుకుంటారు జగన్. అక్కడ టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. ఈ కార్యక్రమాన్ని, బహిరంగ సభను విజయవంతం చేయడానికి మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి కొడాలి నాని, కోఆర్డినేటర్ తలశిల రఘురాం ఏర్పాట్లు పూర్తి చేశారు. టిడ్కో నివాసాల ప్రారంభోత్సవాన్ని గడివాడలో పండగలా నిర్వహించనున్నామని కొడాలి నాని, తలశిల రఘురాం తెలిపారు.












Click it and Unblock the Notifications