ఢిల్లీకి జగన్: అన్ని విషయాలపై
న్యూఢిల్లీ: ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం ఆ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. ఈ ఘటన తరువాత టీడీపీతో పొత్తును ప్రకటించింది జనసేన పార్టీ.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ దేశ రాజధానిలో మకాం వేశారు. మూడు వారాలుగా ఆయన అక్కడే ఉంటోన్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లడానికి ప్రయత్నాలు సాగిస్తోన్నారు. అవేవీ పెద్దగా ఫలిస్తోన్నట్లు కనిపించట్లేదు. ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలోనే ఉంటోన్నారు.

ఈ పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. హస్తిన పర్యటనకు బయలుదేరి వెళ్లబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 6వ తేదీన జగన్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కనున్నారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.
తన ఢిల్లీ పర్యటన సందర్భంగా వైఎస్ జగన్- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోనూ భేటీ అవుతారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురినీ కలిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్ట్ బకాయిల విడుదల, విశాఖపట్నంలో మెట్రో రైలు కారిడార్ అభివృద్ధి.. వంటి అంశాలపై వైఎస్ జగన్ వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు గురించి ప్రధాని మోదీ, ఆయన మంత్రి వర్గ సహచరులకు ఓ మెమొరాండం ఇవ్వనున్నారు.
గతంలో ఐటీ అధికారులు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడం, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, ఫైబర్ గ్రిడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ భూముల కేసులపై అటు ఏపీ సీఐడీ అధికారులు తమ దర్యాప్తును ముమ్మరం చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ జగన్.. ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ కాబోతోండటం చర్చనీయాంశమౌతోంది.












Click it and Unblock the Notifications