కోడికత్తి శీను జైల్లో ఏం చేశాడో తెలుసా?
సీఎం వైఎస్ జగన్ పై 2019 ఎన్నికలకు ముందు కోడికత్తితో దాడిచేసిన కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు విశాఖపట్నం కేంద్ర కారాగారం నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో ఆయన అంబేద్కర్ ఫోటో పట్టుకొని వచ్చాడు. దాదాపు ఐదు సంవత్సరాలపాటు బెయిల్ రాకుండా జైల్లో ఉన్న శీను అక్కడ ఖాళీగా ఉండలేదు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి 70 శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేశాడు.
రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో దూరవిద్య ద్వారా శీను డిగ్రీ పూర్తిచేసినట్లు బంధువులు వెల్లడించారు. డిగ్రీ పూర్తయిన తర్వాత రాజమండ్రి జైలు నుంచి విశాఖపట్నం జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలైన శీనును మీడియా సమక్షంలో న్యాయవాదులు శ్రీనివాస్, సలీం, విదసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు శీను తండ్రి తాతారావుకు అప్పగించారు.

జైలు బయట శీను కోసం వేచిచూస్తున్న దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు శీను బయటకు రాగానే జైభీం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసు కోసం పోరాటం చేసిన న్యాయవాదులకు, విదసం నాయకులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని లాయర్ సలీమ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీరికి ఏం జరిగినా ముఖ్యమంత్రిదే బాధ్యత అని స్పష్టం చేశారు.
హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలను దళిత సంఘాల నాయకులు విశాఖపట్నం ఎన్‌ఐఏ కోర్టుకు సమర్పించారు. శ్రీనివాసరావు తండ్రి పేరుతో, చిన్నాన్న పేరుతో ఉన్న ఒక్కొక్కటి రూ.6.25లక్షల విలువైన వేర్వేరు భూమి పత్రాలతో పాటు తహసీల్దార్ కార్యాలయం నుంచి సాల్వెన్సీ పత్రాలను జైలు అధికారులకు మెయిల్ చేశారు. వాటి ఆధారంగా విడుల చేయడం కుదరదని, పత్రాలే తీసుకురావాలంటూ జైలు అధికారులు సూచించడంతో దళిత సంఘాల నాయకులు ఎన్ ఐఏ కోర్టుకు వెళ్లి న్యాయమూర్తి సంతకాలతో బెయిల్ ఆదేశాలు తీసుకువచ్చారు.












Click it and Unblock the Notifications