కోడి కత్తి శ్రీనుకు ఏడోసారీ నిరాశే ! జగన్ వరమిచ్చినా ? ఈసారి స్వయంగా కోర్టుకొచ్చి చెబితే.. ?
ఏపీలో 2019 ఎన్నికలకు ముందు సంచలనం రేపిన అంశాల్లో వైఎస్ జగన్ పై కోడి కత్తి దాడి కేసు కూడా ఒకటి. వైజాగ్ ఎయిర్ పోర్టులో జగన్ పై కోడి కత్తితో ఎలాంటి కారణం లేకుండానే దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న జనిపల్లి శ్రీనివాస్ కు తాజాగా విజయవాడ ఎన్ఐఏ కోర్టు వరుసగా ఏడోసారి బెయిల్ తిరస్కరించింది. దీంతో ఆయన జైల్లోనే మగ్గాల్సిన పరిస్దితి. అయితే శ్రీనివాస్ బెయిల్ పై బాధితుడిగా ఉన్న జగన్ ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తకపోయినా ఆయన బెయిల్ తిరస్కరించడంతో 31 నుంచి ప్రారంభమయ్యే రెగ్యులర్ విచారణలో ఏం జరగబోతోందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

కోడి కత్తి కేసు
2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ పై వైజాగ్ ఎయిర్ పోర్టులో కోడి కత్తితో జనిపల్లి దాడి చేసిన ఘటన అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికల్లోనూ వైసీపీకి ఇది బాగా ఉపయోగపడింది. అలాగే ఈ కేసులో ఏం జరిగిందో కూడా ఎవరికీ అర్ధం కాక ముందే ఎన్నికలు పూర్తయిపోవడం, వైసీపీ అధికారంలోకి రావడం జరిగిపోయాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఈ కేసు ఎన్ఐఏ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఎన్ఐఏ కూడా పలు రకాలుగా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నా ఇప్పటికీ ఆ దాడి ఎందుకు జరిగిందో కనిపెట్టలేకపోయింది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఎన్ఐఏ ఇంతకాలంగా ఎలాంటి పురోగతి సాధించలేకపోయిందన్న విమర్శల మధ్య ఏడోసారి బెయిల్ కు దరఖాస్తు చేసుకున్న నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ కు మరోసారి చుక్కెదురైంది.

జనిపల్లి శ్రీనివాస్ కు ఏడోసారి నిరాశే
కోడి కత్తి కేసులో నాలుగేళ్ల క్రితం అరెస్టైన జనిపల్లి శ్రీనివాస్ కు అప్పటి నుంచి బెయిల్ దొరకడం లేదు. ఏపీ పోలీసుల నుంచి ఎన్ఐఏకు కేసు మారిన బెయిల్ మాత్రం దొరకడం లేదు. జనిపల్లి శ్రీనివాస్ బెయిల్ కోసం దరఖాస్తు పెట్టుకోవడం, అది కాస్తా తిరస్కరణకు గురికావడం జరుగుతూనే ఉంది. కానీ ఈసారి మాత్రం కచ్చితంగా శ్రీనుకు బెయిల్ దొరుకుతుందని అంతా భావించారు. దీనికి ప్రధాన కారణం శ్రీనుకు బెయిల్ ఇచ్చే విషయంలో బాధితుడిగా ఉన్న వైఎస్ జగన్ అభ్యంతరాలు లేవనెత్తకపోవడమే. దీంతో శ్రీనుకు బెయిల్ వస్తుందని భావించినా ఎన్ఐఏ కోర్టు మాత్రం ఏడోసారి తిరస్కరించింది.

జగన్ కోర్టుకు హాజరై చెబితే.. ?
కోడి కత్తి శ్రీను బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నా కేసు తీవ్రత దృష్ట్యా అతనికి వివిధ కారణాలు చూపి బెయిల్ ఇవ్వట్లేదు. అయితే ఎలాంటి ప్రొఫైల్ లేని, రాజకీయ చరిత్ర కూడా లేని ఓ సాధారణ వ్యక్తి జనిపల్లి శ్రీనివాస్ కు బెయిల్ రాకపోవడం వెనుక ఏం జరుగుతుందనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. కానీ బెయిల్ మాత్రం రావడం లేదు. దీంతో ఈసారి బాధితుడిగా ఉన్న జగన్ ను శ్రీను తల్లితండ్రులు సాయం కోరారు. జగన్ నేరుగా ఎన్వోసీ ఇచ్చారో లేదో తెలియదు కానీ అభ్యంతరాలైతే చెప్పలేదు. అయినా బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఈసారి ఎన్ఐఏ కోర్టు సూచన మేరకు బాధితుడైన వైఎస్ జగన్ కోర్టుకు వచ్చి శ్రీనుకు బెయిల్ ఇవ్వమని కోర్టును కోరితే మాత్రం కచ్చితంగా ప్రయోజనం ఉంటుందని న్యాయవాదులు చెప్తున్నారు. కానీ జగన్ కోర్టుకు వచ్చి మరీ శ్రీను బెయిల్ కోసం సాయం చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. అసలే ఎన్నికల ఏడాది కాబట్టి ఏదైనా జరగొచ్చనే వారూ లేకపోలేదు.












Click it and Unblock the Notifications