ఏపీలో మరోసారి ప్రత్యేక హోదా ఉద్యమం..!!
ఏపీలో మరోసారి ప్రత్యేక హోదా అంశం తెర మీదకు వచ్చింది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న బీహార్ సీఎం నితీశ్ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్టీ తీర్మానం చేసారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ పెండింగ్ లో ఉంది. ఇప్పుడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయిన సమయంలో తిరిగి ప్రత్యేక హోదా డిమాండ్ తో ఉద్యమానికి పార్టీలు సిద్దమవుతున్నాయి.
హోదా కోసం ఉద్యమం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం సిపిఐ తప్పకుండా ఉద్యమం చేస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ఆస్తులు తీసుకోమని అప్పట్లో జగన్ తెలంగాణ ప్రభుత్వానికి చెప్పాడు అని గుర్తు చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ స్వాగతిస్తున్నామన్నారు. ఇక, బ్రిటిష్ వాళ్ళు ప్రవేశ పెట్టిన చట్టాలు అమలు చేస్తూ.. మోడీ ఆ చట్టాల పేర్లు మార్చారు అని సీపీఐ నారాయణ తెలిపారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుందని చెప్పుకొచ్చారు.

జగన్ ను ఓడించి
నితీశ్..చంద్రబాబు ఇద్దరూ ప్లేట్ ఫిరాయించకుండా మోడీ పట్టుకున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. ప్రమాదకరమైన బీజేపీని చంద్రబాబు రెండోసారి రాష్ట్రానికి రప్పించారన్నారు. గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధుల కోసం ఒత్తిడి చేయలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు పరిగణలోకి తీసుకొని సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రజలు చంద్రబాబుకు అధికారం అప్పగించారు తప్ప.. బీజేపీ, జనసేన పార్టీల పొత్తు వల్ల కాదు అని తెలిపారు.
ఏపీ ప్రజల హక్కు
ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రజల హక్కు అని, ఇది రాష్ట్ర అభివృద్ధితో ముడిపడిన అంశమని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక సమస్యలను ప్రత్యేక హోదాతో ముడిపెట్టడం ఆక్షేపణీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కేంద్రం నుంచి నిధులు సాధించటం దీనితో సంబంధం లేని విషయమని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేయటానికి ప్రత్యేక హోదాతో ముడి పెట్టడం సరైనది కాదన్నారు.












Click it and Unblock the Notifications